పంచదార రేటు ఆకాశాన్నంటుతోంది. అయినా చాయ్‌నుంచి స్వీట్‌దాకా అన్నిట్లో అది నిత్యావసరమే. కొన్ని వంటగదుల్లో షుగర్‌ ఉందోలేదోగానీ శరీరాల్లో మాత్రం మోతాదుకు మించి ఉంటోంది. వందకు సగంమంది మధుమేహం బాధితులే. తెల్లారిలేస్తే టాబ్లెట్లు, ఇన్సులిన్లతో షుగర్‌ పేషెంట్లు ఇంక్యుబేటర్‌ బేబీల్లా బతకాల్సి వస్తోంది. ఇక డాక్టర్లకైతే ఈ షుగర్‌ జబ్బుతో డబ్బేడబ్బు. జీవితకాలం జాగ్రత్తపడాల్సిందేనా. దీనికి మందేమీ లేదా అంటే.. అదేపనిలో ఉన్న శాస్త్రవేత్తలు షుగర్‌ పేషెంట్లకో ‘తీపి’కబురు చెబుతున్నారు.

మధుమేహాన్ని శరీరంనుంచి తరిమికొట్టే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తల పరిశోధన ముందడుగు వేసింది. హ్యూమన్‌ ప్యాంక్రియాస్ నుంచి సేకరించిన స్టెమ్‌కణాలను వృద్ధిచేసి ఇన్సులిన్‌ తయారీ ఆర్గనాయిడ్స్‌గా మార్చడంలో శాస్త్రవేత్తల ప్రయత్నం ఫలించింది. షాంఘైలోని చైనీస్ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధక బృందం ఈ ప్రయత్నంలో చాలావరకు విజయం సాధించింది. ఈప్రయోగంలో దాతల ప్యాంక్రియాస్‌ నుంచి సేకరించిన అరుదైన కణాలను ప్రయోగశాలలో తీ్రడీ క్లస్టర్లుగా వృద్ధిచేశారు. దీంతో ఐదునెలల్లోనే పది దశలో ఇవి 300 మిలియన్‌రెట్లు పెరిగాయి.

రక్తంలో షుగర్‌ లెవల్స్‌ని గుర్తించి ఒరిజనల్‌ ప్యాంక్రియాస్‌లాగే ఇవి ఇన్సులిన్‌ని విడుదల చేయటంతో మధుమేహంపై పోరాటంలో కీలకఅడుగుపడింది. ఎలుకలపై జరిపిన పరిశోధనలో వారంలోపే షుగర్‌లెవల్స్‌ సాధారణ స్థాయికి వచ్చినట్లు గుర్తించారు. ఏడాదిపాటు 11 ఎలుకలపై సాగిన సుదీర్ఘప్రయోగం మధుమేహ వ్యాధిగ్రస్థులకు భరోసా ఇస్తోంది. టైప్‌వన్‌ డయాబెటిస్‌తో బాధపడే దాదాలనుంచి సేకరించే ఐలెట్‌ ట్రాన్స్‌ప్లాంట్స్‌ కొంత ఉపశమనం ఇస్తాయి. కానీ అవసరానికి తగ్గట్లు దాతల ప్యాంక్రియాస్లు దొరకవు. ల్యాబ్‌లో పునరుత్పత్తి చేసుకోగలిగే స్టెమ్‌ కణాలు అందుబాటులోకొస్తే మధుమేహ చికిత్సలో ఇదో విప్లవం కాబోతోంది. ప్రస్తుతానికి ఎలుకలపై జరిపిన ప్రయోగం విజయవంతమైంది. ఇది కార్యరూపం దాల్చి అందుబాటులోకొస్తే భవిష్యత్తులో షుగర్‌ పేషెంట్లకు ఇన్సులిన్‌ ఇంజక్షన్స్‌నుంచి శాశ్వత విముక్తి కలగబోతోంది.