అమెరికాను వెంటాడుతున్న సాఫ్ట్‌వేర్ సమస్యలు
US software outages: అమెరిలో టెక్నికల్ సమస్యలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. వరుసగా జరుగుతున్న పరిణామాలు యూఎస్ వాసులను కలవరపెడుతున్నాయి. ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతోంది..?

US software outages: అమెరికా.. ప్రపంచ సాంకేతిక రంగానికి కేరాఫ్ అడ్రస్. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలకు నిలయమైన ఈ అగ్రరాజ్యం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తోంది. అయితే ఇప్పుడు అదే అమెరికాను వరుస సాంకేతిక సమస్యలు కలవరపెడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి చోటుచేసుకుంటున్న అంతరాయాలు ప్రభుత్వ సేవల నుంచి విమానయానం, బ్యాంకింగ్ రంగాల వరకు ప్రభావం చూపుతున్నాయి. దీంతో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు కలిగిన దేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయనే చర్చ మొదలైంది.
మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం.. లక్షలాది మందికి ఇబ్బందులు
తొలుత ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గత గురువారం చోటుచేసుకున్న ఈ అంతరాయం కారణంగా ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఏఐ ఆధారిత అసిస్టెంట్ కోపైలట్ వంటి కీలక సేవలు ప్రభావితమయ్యాయి. ఈ సేవలపై ఆధారపడే ఉద్యోగులు, వ్యాపార సంస్థలు, సాధారణ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈమెయిల్స్ పంపడం, స్వీకరించడం, ఆన్‌లైన్ సమావేశాల్లో పాల్గొనడం, ఏఐ సేవలను వినియోగించుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి. డిజిటల్ సేవలు ఎంతగా విస్తరించాయో, వాటిలో చిన్నపాటి అంతరాయం కూడా ఎంతటి ప్రభావాన్ని చూపగలదో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
విమానయాన రంగాన్నీ వదలని సాంకేతిక చిక్కులు
మైక్రోసాఫ్ట్ సేవల్లో సమస్యలు సద్దుమణగకముందే శుక్రవారం అమెరికా విమానయాన నియంత్రణ వ్యవస్థలోనూ సాంకేతిక అవాంతరం తలెత్తింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో ఏర్పడిన సమస్య విమానయాన రంగంపై ఆందోళన కలిగించింది. విమానాల రాకపోకలు, వాటి నిర్వహణ, భద్రతకు సంబంధించిన సమాచార వ్యవస్థలు సజావుగా పనిచేయడం ఎంత ముఖ్యమో ఈ పరిణామం గుర్తుచేసింది. విమానయాన రంగం డిజిటల్ వ్యవస్థలపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఇలాంటి సమస్యలు తలెత్తితే ప్రయాణికులతో పాటు విమానయాన సంస్థలపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
బ్యాంకుల్లో సాంకేతిక లోపాలు.. ఆన్‌లైన్ లావాదేవీలకు బ్రేక్
ఇక తాజాగా అమెరికాలోని పలు ప్రముఖ బ్యాంకుల డిజిటల్ సేవల్లోనూ అంతరాయాలు ఏర్పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, చేజ్, జేపీమోర్గాన్, యూఎస్ బ్యాంక్, వెల్స్ ఫార్గో వంటి సంస్థల వినియోగదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖాతాల్లోకి లాగిన్ కావడం, నగదు బదిలీలు చేయడం, ఆన్‌లైన్ చెల్లింపులు నిర్వహించడం వంటి సేవల్లో సమస్యలు తలెత్తినట్లు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. డౌన్‌డిటెక్టర్ వంటి వెబ్‌సైట్లలోనూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో బ్యాంకింగ్ సేవలపై ఆధారపడే వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో డబ్బు బదిలీ చేయలేకపోవడం, ఖాతా వివరాలను పరిశీలించలేకపోవడం వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది.
సైబర్‌దాడి కాదు.. సాఫ్ట్‌వేర్ బగ్ కారణమన్న చేజ్
ఈ అంతరాయంపై చేజ్ బ్యాంక్ స్పందిస్తూ.. తమ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల లావాదేవీల ప్రాసెసింగ్‌లో జాప్యం జరుగుతోందని వెల్లడించింది. ఇది సైబర్‌దాడి కాదని స్పష్టం చేసింది. వినియోగదారుల ఖాతాలు, నిధులు సురక్షితంగానే ఉన్నాయని, సమస్య పరిష్కారానికి సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది. జేపీమోర్గాన్ చేజ్ ఆన్-ప్రిమైస్ హార్డ్‌వేర్ వ్యవస్థలోని సాఫ్ట్‌వేర్ బగ్ ఈ సమస్యకు కారణమని బ్యాంకు ప్రతినిధులు వివరించారు. ఈ లోపం ప్రధానంగా చేజ్ వినియోగదారులపై ప్రభావం చూపిందని, ఆ బ్యాంకుతో లావాదేవీలు నిర్వహించే ఇతర ఆర్థిక సంస్థల కస్టమర్లు కూడా జాప్యాన్ని ఎదుర్కొని ఉండవచ్చని తెలిపారు. అయితే ఇది అమెరికా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదని స్పష్టం చేశారు.
జెల్లే నెట్‌వర్క్ సజావుగానే.. చెల్లింపుల్లో మాత్రం ఆలస్యం
అమెరికాలో విస్తృతంగా ఉపయోగించే పీర్-టు-పీర్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ జెల్లేపైనా ఈ పరిణామాల ప్రభావం కనిపించింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులకు తక్షణమే డబ్బు పంపుకునేందుకు జెల్లే ఉపయోగపడుతుంది. ఎర్లీ వార్నింగ్ సర్వీసెస్ యాజమాన్యంలో కొనసాగుతున్న ఈ నెట్‌వర్క్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్యాపిటల్ వన్, జేపీమోర్గాన్ చేజ్, పీఎన్‌సీ బ్యాంక్, ట్రూయిస్ట్, యూఎస్ బ్యాంక్, వెల్స్ ఫార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే జెల్లే నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని ఎర్లీ వార్నింగ్ సర్వీసెస్ చెబుతోంది. కొన్ని ఆర్థిక సంస్థల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా ఆయా బ్యాంకుల వినియోగదారులకు జెల్లే ద్వారా జరిగే చెల్లింపుల్లో ఆలస్యం చోటుచేసుకోవచ్చని వివరించారు.
అమెరికా వ్యాప్తంగా ఆందోళన
ప్రపంచానికి టెక్నాలజీ పాఠాలు చెబుతున్న అమెరికాలోనే వరుస అంతరాయాలు చోటుచేసుకోవడం డిజిటల్ ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి గుర్తుచేస్తోంది. సాంకేతిక అభివృద్ధి ఎంత ముఖ్యమో.. ఆ వ్యవస్థలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేసేలా పటిష్ఠంగా రూపొందించడం కూడా అంతే ముఖ్యమనే సందేశాన్ని ఈ ఘటనలు ఇస్తున్నాయి.



