Jensen Huang Comeback: ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక సంస్థగా ఎదిగిన ఎన్‌విడియాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 33 ఏళ్ల పాటు కంపెనీని నడిపించి, ప్రపంచంలోనే అత్యంత విలువైన చిప్ తయారీ సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దిన మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను తిరిగి అదే బాధ్యతల్లోకి తీసుకురావాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఆయన రాజీనామా నేపథ్యంలో సిలికాన్ వ్యాలీకి చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం వెల్లడించింది. మరోవైపు కొత్త సీఈఓ ఎంపికపై కంపెనీ బోర్డు కసరత్తు కొనసాగిస్తోంది.

జెన్సన్ పునరాగమనంపై కీలక చర్చలు

చైనాకు చెందిన అలిస్ హువాంగ్‌తో వివాహేతర సంబంధంతో పాటు.. ఎన్విడియాలో పని చేస్తున్న మరో ఉద్యోగితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు గతకొన్ని రోజులుగా భగ్గుమన్నాయి. దీంతో ఆయన సీఈవో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎన్‌విడియా నుంచి వైదొలిగిన హువాంగ్.. తిరిగి సంస్థ పగ్గాలు చేపట్టే అంశంపై తనకు అత్యంత సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఆయన తిరిగి రావాలనే డిమాండ్‌కు మద్దతు కూడగట్టేందుకు టెక్నాలజీ రంగంలోని ప్రముఖ సంస్థల అధిపతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారానికి హువాంగ్ సైతం మద్దతు ఇస్తున్నట్లు ఆయనకు సన్నిహితులు.. అంతర్జాతీయ మీడియాకు లీకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ స్థాయిలోనూ మద్దతు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో హువాంగ్ నిష్క్రమణకు దారితీసిన పరిస్థితులపై ఎన్‌విడియా డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

మస్క్, టిమ్ స్వినీ మద్దతు

హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించాలనే ప్రచారానికి ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి మద్దతు లభిస్తోంది. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, ఎపిక్ గేమ్స్ సీఈఓ టిమ్ స్వినీ ఈ ప్రయత్నానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. Bring Jensen Back పేరుతో రూపొందించిన బహిరంగ లేఖపై సంతకాలు చేయాలని టెక్ రంగ ప్రముఖులకు పిలుపునిచ్చారు. హువాంగ్‌ను తిరిగి నియమించాలని ఎన్‌విడియా బోర్డును కోరారు. ఈ ప్రచారానికి సంబంధించిన ఓ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్.. జెన్సన్ హువాంగ్ పునర్నియామకానికి మద్దతుగా పిటిషన్ కొనసాగుతోందని, తాను కూడా దానిపై సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. బయట టెక్ దిగ్గజాల నుంచే కాకుండా ఎన్‌విడియా ఉద్యోగుల నుంచి కూడా హువాంగ్‌కు మద్దతు లభిస్తున్నట్లు సమాచారం. సంస్థలోని పలువురు ఉద్యోగులు ఆయన తిరిగి రావాలని కోరుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు Bring Jensen Back లేఖపై సంతకాలు కూడా చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.

సమావేశాల్లో ఉద్యోగులపై ఆగ్రహం..?

మరోవైపు జెన్సన్ హువాంగ్ పని తీరుపై కూడా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సమావేశాల్లో తన కిందిస్థాయి ఉద్యోగులపై ఆయన ఆగ్రహావేశాలు ప్రదర్శించేవారని న్యూయార్క్ పోస్ట్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 మందికి పైగా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్న సమావేశంలో అప్పటి గ్లోబల్ ఫీల్డ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయ్ పురీని హువాంగ్ లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఆ సమావేశంలో ఒక దశలో పురీని ఉద్దేశించి చనిపో అంటూ జెన్సన్ హువాంగ్ అన్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.