చైనా స్పై వలలో ఎన్విడియా బాస్
Nvidia CEO Chinese spy controversy: ఎన్విడియా సీఈవో వివాహేతర సంబంధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చైనా స్పైతో ఆయన ప్రేమలో ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ అంగీకరించారు. ఇప్పుడు ఈ వ్యవహారం అమెరికా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ జెన్సన్ ప్రేమించి అమ్మాయి ఎవరు..? ఆయన ఉద్యోగులకు ఎందుకు లేఖ రాశారు..?

Nvidia CEO Chinese spy controversy: ప్రపంచాన్ని ఏలుతున్న ఏఐ చిప్‌ల సామ్రాజ్యానికి అధిపతి.. టెక్నాలజీ రంగంలో తిరుగులేని నాయకుడు.. అలాంటి వ్యక్తి వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ప్రపంచస్థాయిలో చర్చనీయాంశమైంది. మగాడి బలహీనత ఆడదే అన్నట్లు.. ఓ మహిళతో ఏర్పడిన సన్నిహిత సంబంధం ఇప్పుడు ఏకంగా అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా మారింది. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ చుట్టూ చైనా గూఢచర్య ఆరోపణలు ముసురుకున్నాయి. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది..? ఇంతకీ హువాంగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఎవరు..? అసలు ఎన్విడియా సీఈవో సీక్రెట్ లవ్‌స్టోరీ గురించి తెలుసుకోవాలంటూ ఈ స్టోరీ చూడాల్సిందే.
అవును నేను ఆమెతో సంబంధం పెట్టుకున్నాను: హువాంగ్
ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ ఓ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు అంగీకరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. చైనా గూఢచర్య కార్యకలాపాలతో సంబంధం ఉందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్న ఆలిస్ హువాంగ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్విడియా ఉద్యోగులకు పంపిన సందేశంలో హువాంగ్ తన వ్యక్తిగత తప్పును అంగీకరించినట్లు ఎన్విడియా ఉద్యోగులకు మెయిల్స్ పంపించారు. తన భార్యకు, పిల్లలకు తీవ్ర బాధ కలిగించానని.. తాను చేసిన తప్పుకు ఎలాంటి సమర్థన లేదని ఆయన పేర్కొన్నారు. కొన్ని బలహీన క్షణాల్లో తాను అలా చేసినట్లు ఉద్యోగులకు పంపిన మెయిల్లో స్పష్టంగా తెలిపారు. తన కుటుంబానికి, ఎన్విడియా ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన హువాంగ్.. సంస్థ నాయకుడిగా తన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించడంలో విఫలమయ్యానని అంగీకరించారు. ఉద్యోగులు, బోర్డు సభ్యులు, భాగస్వాములు, వాటాదారుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సీఈవోను ముగ్గులోకి దింపిన ఆలిస్ స్టోరీ ఇదే..!
ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆలిస్ హువాంగ్ అలియాస్ హువాంగ్ లీ. చైనాకు చెందిన ఆమె గతంలో అక్కడి ప్రముఖ టెలివిజన్ ఛానల్లో న్యూస్ రిపోర్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న మెగాస్పీడ్ అనే డేటా సెంటర్ సంస్థలో కీలకంగా ఉన్నారు. ఇక్కడే అసలు అనుమానాలు మొదలయ్యాయి. గత రెండేళ్లలో మెగాస్పీడ్ సంస్థ ఎన్విడియా నుంచి సుమారు 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ చిప్‌లను కొనుగోలు చేసింది. ఈ సంస్థతో సంబంధాల నేపథ్యంలో ఆలిస్ హువాంగ్‌పై అమెరికా నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆమె చైనా ప్రభుత్వ నిఘా వ్యవస్థతో సంబంధాలు కలిగి ఉండి, ఎన్విడియా కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించి ఉండవచ్చన్నది అమెరికా అధికారుల బలంగా అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం తీవ్రతను గుర్తించిన ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ సమాచారం బయటకు వెళ్లిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
హువాంగ్‌కు మద్దతు పలికిన ట్రంప్
ఓవైపు గూఢచర్య ఆరోపణలు, మరోవైపు వ్యక్తిగత జీవితంపై వివాదం.. ఇలా జెన్సన్ హువాంగ్ చుట్టూ పరిస్థితులు వేడెక్కుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు మద్దతుగా నిలిచారు. హువాంగ్ గౌరవప్రదమైన వ్యక్తి అని, ఎన్విడియాకు ఆయన నాయకత్వం వహించడం కొనసాగించాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హువాంగ్‌తో నేరుగా మాట్లాడలేదని చెప్పిన ఆయన.. తనకు తెలిసినంతవరకు హువాంగ్ మంచి వ్యక్తి అని, అమెరికాకు విలువైన సేవలు అందించారని ప్రశంసించారు. అయితే అసలు ఏం జరిగిందో ఎవరికీ పూర్తిగా తెలియదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.
జెన్సన్ హువాంగ్‌పై అమెరికా కాంగ్రెస్ సీరియస్
ఈ వ్యవహారం ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు రిపబ్లికన్ కమిటీ ఛైర్మన్లు జెన్సన్ హువాంగ్ నుంచి వివరణ కోరింది. ఆలిస్ హువాంగ్‌తో ఆయనకు ఉన్న సంబంధాలు, ఎన్విడియా చిప్‌లకు సంబంధించిన భద్రతా వ్యవస్థలు, విదేశీ గూఢచర్య ముప్పులపై వివరణ ఇవ్వాలని వారు కోరారు. బహిరంగంగా కాకుండా రహస్య సమావేశంలో ఈ వివరాలు వెల్లడించాలని సూచించారు. నవంబర్ 18న ఈ అంశంపై క్లోజ్డ్ డోర్ బ్రీఫింగ్ నిర్వహించాలన్నది వారి ప్రతిపాదనగా.. ఇప్పటికే సమాచారాన్ని పంపినట్లు అమెరికా మీడియా కోడై కూస్తోంది. దీంతో ఎన్విడియా చేపట్టిన స్వతంత్ర విచారణపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
విచారణలో ఏం తేలనుంది..?
మొత్తానికి.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన టెక్ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా అధినేతను ఇప్పుడు ఓ వ్యక్తిగత సంబంధం, గూఢచర్య అనుమానాలు, అమెరికా రాజకీయాలు చుట్టుముట్టాయి. ఒకవైపు కుటుంబానికి క్షమాపణలు చెబుతూ మరోవైపు కంపెనీపై తన నిబద్ధతను చాటుకున్న హువాంగ్.. ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆలిస్ హువాంగ్‌పై వచ్చిన గూఢచర్య ఆరోపణలు, రహస్య సమాచారం చేరవేశారన్న అనుమానాలు ఇంకా దర్యాప్తులో తేలాల్సిన అంశాలే.



