USA Aviation Crisis: అమెరికా విమానయాన రంగాన్ని సాంకేతిక సమస్యలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం మొదలైన ఈ సమస్య వారాంతమంతా కొనసాగడంతో వేలాది విమాన సర్వీసులు రద్దు కాగా, మరెన్నో విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీంతో విమాన ప్రయాణాలు చేయాల్సిన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఒక్కరోజే 8,800 విమానాలు ఆలస్యం

అమెరికాలో ఆదివారం అంటే చాటు.. చాలా మంది వెకేషన్‌కు వెళ్తార. అలాంటి ఆదివారం నాటికి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఒక్కరోజులోనే సుమారు 8,800 విమానాలు ఆలస్యంగా నడిచినట్లు అధికారులు వెల్లడించారు. మరో 2,400 విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. విమానాలు మాత్రమే కాకుండా, వాటికి సంబంధించిన సిబ్బంది కూడా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోవడంతో విమానయాన సంస్థలకు కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం సవాలుగా మారింది. ఈ అంతరాయం ప్రభావం వెంటనే తొలగిపోయే అవకాశం లేదని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ వెల్లడించారు. విమానాలు, సిబ్బంది తిరిగి తమ తమ ప్రాంతాలకు చేరుకుని షెడ్యూల్‌ను సరిచేసుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడటానికి సోమవారం వరకు సమయం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.

కంప్యూటర్ రూటర్ నుంచి తప్పుడు సంకేతాలు

ఈ సంక్షోభానికి ఏటీసీ వ్యవస్థలోని కీలక సాంకేతిక విభాగంలో ఏర్పడిన వైఫల్యమే ప్రధాన కారణంగా ప్రాథమికంగా గుర్తించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి, విమాన పైలట్లకు మధ్య సమాచార మార్పిడిని పర్యవేక్షించే వ్యవస్థలో సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఏటీసీ వ్యవస్థను ఆధునికీకరించే పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ రూటర్ నుంచి తప్పుడు సంకేతాలు వెలువడటమే నెట్‌వర్క్ కుప్పకూలడానికి కారణమని మంత్రి సీన్ డఫీ వివరించారు. ఈ సాంకేతిక లోపం కారణంగా విమానాల రాకపోకలను సమర్థంగా పర్యవేక్షించడం, సమాచారాన్ని సమయానికి చేరవేయడం వంటి కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. అసలు సమస్య ఎలా తలెత్తింది? దీనికి బాధ్యులెవరు? అనే అంశాలపై ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

ఏటీసీ వ్యవస్థ ఆధునికీకరణకు ట్రంప్ పిలుపు

మరోవైపు, విమానయాన రంగంలో ఏర్పడిన ఈ గందరగోళంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దేశంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అమెరికా కాంగ్రెస్ తక్షణమే అవసరమైన నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఏటీసీ వ్యవస్థలోని కీలక భాగాలు దాదాపు 50 ఏళ్ల క్రితం నాటివని ట్రంప్ పేర్కొన్నారు. ఇంతటి పాత సాంకేతిక వ్యవస్థపై ఆధారపడటం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

గాడిన పెట్టేందుకు అధికారుల ప్రయత్నాలు

ఇలా ఒక సాంకేతిక లోపం అమెరికా అంతటా విమాన రాకపోకలను ప్రభావితం చేయడంతో విమానయాన రంగంలో ఏర్పడిన సంక్షోభం చర్చనీయాంశంగా మారింది. ఏటీసీ వ్యవస్థలోని లోపాలను గుర్తించి సరిదిద్దడంతో పాటు, విమాన సర్వీసులను సాధారణ స్థితికి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు.