అమెరికాలో భారతీయులకు గడ్డుకాలం మొదలైందా…?
Anti Indian hate in USA: అమెరికాలో ఇండియన్స్‌పై పెరుగుతున్న ద్వేషం.. ట్రంప్ పాలనతో మారిన పరిస్థితులు.. అమెరికాలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

Anti Indian hate in USA: ఒకప్పుడు అమెరికాలో భారతీయులంటే గౌరవం.. ఆ దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక భాగస్వాములనే గుర్తింపు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. భారతీయులపై ద్వేషం పెరుగుతోంది.. జాత్యహంకార దాడులు భయపెడుతున్నాయి.. ఇండియన్స్ గో బ్యాక్ అంటూ బహిరంగంగానే నినాదాలు వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యంలో భారతీయుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందా..? అంటే తాజాగా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన భారతీయ అమెరికన్ అమిష్ షా చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.
ఆరు నెలల్లోనే మారిపోయిన అమెరికా వాతావరణం!
అరిజోనా రాష్ట్రం నుంచి అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా 48 ఏళ్ల వైద్యుడు అమిష్ షా చరిత్ర సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఆయన.. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. తనకు ఓటేసినవారైనా, వేయనివారైనా అందరికీ బాధ్యతాయుతమైన ప్రతినిధిగా ఉంటానని ప్రకటించారు. అయితే భారతీయులపై అమెరికాలో పెరుగుతున్న ద్వేషం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత ఆరు నెలల్లో భారతీయులపై ద్వేషభావం విపరీతంగా పెరిగిందని, తన జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని అమిష్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు భారతీయులను గౌరవించిన అమెరికన్లలో ఇప్పుడు వ్యతిరేకత పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్ రాకతో మరింత వేడెక్కిన విద్వేష జ్వాలలు!
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయులపై వ్యతిరేక ప్రచారం మరింత తీవ్రమైందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వేదికలపై భారతీయులను గెంటేయండి వంటి నినాదాలు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. దక్షిణాసియా సంతతికి చెందిన ప్రజలపై ఆన్లైన్ ద్వేషం, బెదిరింపులు భారీగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. 2024 అక్టోబర్ నాటికి 46 వేల ట్రోలింగ్ ఘటనలు, 884 బెదిరింపు కేసులు నమోదైనట్లు పేర్కొనగా.. 2025 అక్టోబర్ నాటికి ఈ సంఖ్య 88 వేలకు చేరింది. అంటే ఏడాదిలోనే దాదాపు 91 శాతం పెరుగుదల నమోదైంది.
హెచ్-1బీ వీసాలపై గురి.. భారతీయుల ఉద్యోగాలకూ ముప్పు
భారతీయులపై వ్యతిరేకతకు హెచ్-1బీ వీసా విధానం కూడా ఒక కారణంగా మారుతోంది. వీసా ఫీజుల పెంపు, 104 మంది భారతీయులను వెనక్కి పంపించడం వంటి పరిణామాలు చర్చకు దారితీశాయి. మరోవైపు భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారంటూ మితవాద సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి. అర్హత, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు పొందుతున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ప్రచారం.. క్రమంగా జాత్యహంకార ధోరణులకు ఆజ్యం పోస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో మొదలైన ద్వేష ప్రచారం కేవలం పోస్టులు, కామెంట్లకే పరిమితం కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో భౌతిక దాడుల రూపంలోనూ బయటపడుతోంది. టెక్సాస్, వర్జీనియా, కాలిఫోర్నియాల్లో దేవాలయాలపై దాడులు జరిగినట్లు సమాచారం..
అగ్రరాజ్యంలో భారతీయుల భద్రతకు కరువు..!
కార్నెగీ ఎండోమెంట్ సర్వే ప్రకారం ప్రతి నలుగురు భారతీయ అమెరికన్లలో ఒకరు ప్రత్యక్షంగా జాత్యహంకార దూషణలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు దాదాపు 40 శాతం మంది భారతీయులు అమెరికాను విడిచి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఒకప్పుడు అమెరికా కలల దేశం. ఉన్నత విద్య, ఉద్యోగాలు, సంపాదన, మెరుగైన భవిష్యత్తు కోసం లక్షలాది మంది భారతీయులు అక్కడికి వెళ్లారు. కానీ ఇప్పుడు అదే అమెరికాలో తమ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగాలపై పోటీ, వీసా ఆంక్షలు, రాజకీయ విద్వేషాలు.. అన్నీ కలిపి భారతీయుల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. ఒకప్పుడు అమెరికా అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన భారతీయులే ఇప్పుడు అక్కడ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.



