తిరగబడిన అమెరికా జనం.. ట్రంప్‌కూ తప్పని దెబ్బ
Political Impact on Donald Trump: నేనే రాజు.. నేనే అధ్యక్షుడిని అని విర్రవీగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రజలు గట్టి దెబ్బ కొట్టారు. బాబోయ్ నీ పరిపాలనతో విసిగిపోయామంటూ ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పారు. ఇన్నాళ్లూ ఏ నిర్ణయాలు పడితే ఆ నిర్ణయాలు తీసుకున్న ట్రంప్‌కు ఇక డెమోక్రాట్లు చుక్కలు చూపించనున్నారు..

Political Impact on Donald Trump: అనగనగా అమెరికా అనే ఒక ఊరు… ఆ ఊర్లో డొనాల్డ్ ట్రంప్ అనే ఒక మామ ఉంటాడు. ఆ మామకు నిద్రలో కల వస్తే చాలు.. వెంటనే అది చేయాలి.. ఇది చేయాలి అనే తపన తప్ప మరో ధ్యాస ఉండదు. ఇంతకీ ఆయన ఏం చేస్తాడనుకుంటున్నారా..? తన చుట్టూ ఉన్న ఇతర దేశాల ప్రజలను ఇబ్బంది పెట్టడమే ఆయన పని. ఒకప్పుడు ఆయన చేసిన మాయాజాలానికి అమెరికా ప్రజలంతా ఫిదా అయిపోయారు. మమ్మల్ని ఉద్ధరించే నాయకుడు వచ్చాడు.. ఆయన చేతుల్లోనే అమెరికా భవిష్యత్తు బాగుపడుతుందని నమ్మి మరీ గెలిపించారు. కానీ ఏం చేస్తాం..? ఆయనలో ఉన్న అసలు మనిషి బయటపడటానికి కొంత సమయం పట్టింది. తీరా ఆయన వ్యవహారశైలి చూసిన తర్వాత కానీ అమెరికా ప్రజలకు అసలు విషయం అర్థం కాలేదు.
అమెరికాను ఉద్ధరిస్తానంటూ.. ప్రపంచ దేశాలకు మంటలు
ఆ దేశాన్ని నాశనం చేస్తా.. ఈ దేశంపై యుద్ధం చేస్తా.. స్నేహంగా ఉన్న దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తా.. అంటూ నోటికి వచ్చిన మాటల్లా అనేశారు. ఆ తర్వాత వాటిని ఆచరణలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ ఏం చేస్తాం..? నిప్పు పెట్టింది ఇప్పుడే.. పొగ వచ్చేసరికి కొంత సమయం పడుతుందని అమెరికా ప్రజలు అనుకున్నారు. కానీ ట్రంప్ మామ పెట్టింది చిన్న మంట కాదు.. భారీ అగ్నిజ్వాల అని తెలిసే సరికి అమెరికా ప్రజలు హడలిపోయారు. ఇంద్రజాలికుడు మాయాజాలం చేయడం నిజమే.. కానీ ఆ మాయాజాలం తమను మోసం చేయడానికేనని గుర్తించారు. అయితే ఏం చేస్తాం..? చేతులు కాలిన తర్వాత కదా ఆకులు పట్టుకునేది..
ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ప్రజల జేబులకు చిల్లులు..!
ట్రంప్ చేసిన పనులకు అమెరికాలో ఒక్కసారిగా ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. చివరకు పిజ్జా, బర్గర్ తినాలన్నా జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే విమర్శలు వినిపించాయి. ఒకప్పుడు గ్రేట్ అమెరికా అంటూ ట్రంప్ ఇచ్చిన నినాదం కాస్తా.. వరస్ట్ అమెరికా అనే విమర్శలకు తావిచ్చింది. అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెడతానన్న నాయకుడే.. తన నిర్ణయాలతో దేశ ప్రజలకు ఆర్థిక భారాన్ని పెంచుతున్నారనే అసంతృప్తి పెరిగింది.
యుద్ధం పేరుతో ఖజానాకు చిల్లు.. సాధించింది ఏమిటి..?
ఇక ఇరాన్‌తో యుద్ధం విషయంలోనూ ట్రంప్ వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారితీసింది. యుద్ధం కారణంగా అమెరికా సైనికుల ప్రాణాలు ప్రమాదంలో పడటమే కాకుండా.. భారీగా ప్రజాధనం ఖర్చయిందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లలా ఖర్చు పెట్టినా.. చివరకు యుద్ధంలో ఏమైనా విజయం సాధించారా అంటే అదీ లేదు. అదిగో యుద్ధం గెలుస్తున్నాం.. ఇదిగో ఇరాన్ పని అయిపోయింది.. అంటూ ట్రంప్ ప్రకటించడమే తప్ప.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. కోట్లాది డాలర్లు ఖర్చు పెట్టి అమెరికాలో సమస్యలను కొనితెచ్చుకోవడమే కాకుండా.. ప్రపంచ దేశాల ముందు అమెరికాను వివాదాలకు కేంద్రంగా నిలబెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మిత్రదేశాలు శత్రువులయ్యాయి.. ప్రజల్లో అసంతృప్తి పెరిగింది..!
మొన్నటి వరకు అమెరికాకు స్నేహితులుగా ఉన్న దేశాలే ఇప్పుడు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. టారిఫ్‌ల పేరుతో మిత్రదేశాలపైనా కఠిన నిర్ణయాలు తీసుకోవడం.. అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీసిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు అమెరికాలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితి.. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ పాలనపై ప్రజల్లో అసంతృప్తికి కారణాలు చాలానే కనిపించాయి. అయినా అమెరికా ప్రజలు వెంటనే స్పందించలేదు. ఓపికతో ఎదురు చూశారు. సరైన సమయం కోసం వేచి చూశారు. అంతే.. మిడ్‌టర్మ్ ఎన్నికలు వచ్చాయి. తమ ఆవేదనను, ఆక్రోశాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ పేపర్‌పై చూపించారు. ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు బలం పెరిగేలా తీర్పునిచ్చారు.
కాంగ్రెస్‌లో బలం తగ్గితే.. ట్రంప్ ఆటలకు బ్రేకులే
ఇంతకీ అమెరికా కాంగ్రెస్‌లో ఎదురయ్యే ఓటమి ట్రంప్‌కు కలిగించే నష్టాలేంటనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఆయనకు ఉన్న రాజకీయ స్వేచ్ఛకు అడ్డుకట్ట పడటమే ప్రధాన పరిణామం. ఇకపై ఆయన నోటివెంట వచ్చే ప్రతి మాట చట్టం కాదు. యుద్ధాలు చేయాలన్నా.. భారీగా టారిఫ్‌లు విధించాలన్నా.. కొత్త విధానాలు అమలు చేయాలన్నా కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల మద్దతు అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాంగ్రెస్‌లో మెజారిటీ కోల్పోతే ట్రంప్ తీసుకునే నిర్ణయాలపై విచారణలు, ప్రశ్నలు, అడ్డంకులు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. బడ్జెట్ ఆమోదం, ప్రభుత్వ నిధుల కేటాయింపులు, కీలక చట్టాల విషయంలోనూ ట్రంప్‌కు ఇబ్బందులు తప్పవు. అంటే ఇన్నాళ్లూ తాను అనుకున్నదే శాసనంగా సాగించిన ట్రంప్‌కు ఇకపై ప్రతీ అడుగులోనూ రాజకీయ అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఏనుగు గుర్తుకు ఓటు వేయాలంటేనే అమెరికన్లకు భయం
గేదె మంచిదే.. కానీ దానికి గుదిబండ కడితేనే మాట వింటుందన్నట్లు.. ట్రంప్ విషయంలోనూ అమెరికా ప్రజలు అదే పనిచేశారని చెప్పొచ్చు. ఆయనకు అధికారమిస్తే ఇష్టానుసారంగా వ్యవహరిస్తారని భావించిన ప్రజలు.. ఎన్నికల ద్వారా గట్టి సందేశం పంపించారు. ఇన్నాళ్లూ ట్రంప్ అంటే భారతీయుల్లోనూ కొద్దోగొప్పో గౌరవం ఉండేది. కానీ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, భారత్‌పై చేసిన వ్యాఖ్యలు ఆ అభిప్రాయాన్ని మార్చేలా చేశాయి. రిపబ్లికన్ పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగు కనిపించినా.. ఓరీ నాయనో.. అంత పెద్ద భారం మనకెందుకంటూ అమెరికన్లు దూరంగా జరిగే పరిస్థితి వచ్చిందనే వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ట్రంప్‌కు మూకుతాడు వేయడం డెమోక్రాట్లకే సాధ్యం
వీటో అధికారమంటూ, రెడ్ క్యాప్ పెట్టుకుని ఫొటోలు దిగుతూ తనదైన శైలిలో రాజకీయాలు చేసే ట్రంప్‌కు.. అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న అధికారాల పరిమితులు కూడా గుర్తు చేయాల్సిన సమయం వచ్చిందని విమర్శకులు అంటున్నారు. ఏ అధికారం ఎప్పుడు ఉపయోగించుకోవాలి.. అధ్యక్షుడి నిర్ణయాలకు ఎక్కడ అడ్డుకట్ట వేయాలి.. ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి అనే విషయాలు డెమోక్రాట్లకు బాగా తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్‌లో వారి బలం పెరిగితే ట్రంప్ దూకుడుకు బ్రేకులు పడే అవకాశం ఉంది. మొత్తానికి పిచ్చి ముదిరిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు.. ట్రంప్ రాజకీయ దూకుడుకు అమెరికా ప్రజలు ఎన్నికల రూపంలో చికిత్స మొదలుపెట్టారని చెప్పొచ్చు. ఇన్నాళ్లూ తాను ఏం చేసినా చెల్లుతుందనుకున్న ట్రంప్‌కు.. ప్రజాస్వామ్యంలో అంతిమ అధికారం ప్రజలదేనని అమెరికన్లు గుర్తు చేశారు.



