అమెరికన్లు ఛీకొట్టినా ట్రంప్ చేతిలో బ్రహ్మాస్త్రం!

చాచి చెంపమీద కొట్టినట్లు అమెరికన్లు తీర్పు ఇచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీని చిత్తుగా ఓడించి ఓ రకంగా ట్రంప్‌ని అభిశంసించారు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలియగానే జాగ్రత్తపడతారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకుంటారు. కానీ ట్రంప్ మొండి.. జగమొండి. జనం ఓట్లతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తనే సూపర్‌పవర్ అంటున్నారు. అధ్యక్ష హోదాలో బ్రహ్మోస్త్రం ప్రయోగిస్తానంటున్నారు.
మిడ్‌టర్మ్ ఎన్నికల్లో అమెరికన్లు డెమోక్రాట్లకు పట్టంకట్టారు. అమెరికా చట్టసభల్లో డెమోక్రాట్లు పైచేయి సాధించారు. ఈ ఫలితాలతో అధ్యక్షుడి ట్రంపరితనానికి కళ్లెం వేసేందుకు విపక్షానికి మరింత బలం చేకూరింది. దీంతో ట్రంప్ డెమోక్రాట్లపై అవసరమైతే వీటో అధికారాల్ని ప్రయోగిస్తానని బెదిరింపులకు దిగారు. ఇంతవరకు చట్టసభల్లో రిపబ్లికన్ సభ్యుల మాటే చెల్లుబాటైంది. దీంతో తనకు నచ్చిన చట్టాలను తీసుకొచ్చి ట్రంప్ చెలరేగిపోతున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కావటంతో అవసరమైతే వీటో అస్త్రాన్ని ప్రయోగిస్తానంటున్నారు.
చట్టసభల ఆమోదంతోనే ఏ బిల్లులైనా చట్టరూపం దాలుస్తాయి. ఆ తర్వాత బిల్లు వైట్‌హౌస్‌కి చేరి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. తన ముందుకొచ్చిన బిల్లుపై అధ్యక్షుడు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా సంతకం పెట్టేయొచ్చు. లేదా ఏమైనా అభ్యంతరాలుంటే వెనక్కి పంపుతూ వీటో చేయొచ్చు. దీనికి 10రోజుల సమయం ఉంటుంది. పదిరోజుల్లో అధ్యక్షుడు సంతకం పెట్టకపోయినా, వీటో చేయకపోయినా బిల్లు దానంతట అదే చట్టంగా మారుతుంది.
వీటో ఉందని ట్రంప్ విర్రవీగడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. చట్టసభల సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది అధ్యక్షుడి అభ్యంతరాలను తోసిపుచ్చేందుకు అంగీకరిస్తేనే బిల్లు ఆమోదం పొందుతుంది. అమెరికా చరిత్రలో అధ్యక్షుడు వీటోచేసిన బిల్లుల్లో 5శాతం మాత్రమే చట్టసభల్లో ఆమోదం పొందగలిగాయి. అంటే రిపబ్లికన్ల మద్దతు లేకుండా ట్రంప్ వీటోని డెమోక్రాట్లు తిప్పికొట్టే అవకాశం దాదాపుగా లేనట్లే. ఆర్థిక అంశాల్లో అధికార విపక్ష సభ్యులు పంతాలకుపోతే పరిస్థితి జటిలంగా మారే ప్రమాదం కూడా ఉంది. అంటే రెండుపక్షాలు తెగేదాకా లాగకుండా సర్దుబాటు ధోరణి ప్రదర్శించాల్సి ఉంటుంది. ట్రంప్ కూడా తనమొండితనం వదిలి కొన్ని విషయాల్లో చట్టసభల అభిప్రాయాలను గౌరవించాల్సి ఉంటుంది.



