AI Space Data Centers: భూమ్మీద స్థలం సరిపోవడం లేదో.. విద్యుత్ బిల్లులు భారంగా మారాయో తెలియదు కానీ ఎలాన్ మస్క్ మాత్రం ఏఐ డేటా సెంటర్లను ఏకంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటివరకు భూమ్మీద భారీ భవనాల్లో డేటా సెంటర్లు చూశాం. సముద్ర గర్భంలోనూ ప్రయోగాలు చూశాం. కానీ మస్క్ ఆలోచనలు మాత్రం భూమి గురుత్వాకర్షణను కూడా దాటి వెళ్లిపోయాయి. లక్షలాది ఉపగ్రహాలతో అంతరిక్షంలోనే ఏఐ డేటా సెంటర్ల సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తన స్టార్ లింక్ శాటిలైట్లతో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను అందిస్తున్న మస్క్.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాడు..

10 లక్షల ఉపగ్రహాలతో భారీ ప్లాన్

ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ముందడుగులో భాగంగా అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ స్పేస్‌ఎక్స్‌కు 10 లక్షల ఉపగ్రహాల వ్యవస్థకు అనుమతి ఇచ్చింది. స్టార్‌మైండ్ పేరుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలో సౌరశక్తిని ఉపయోగించుకుని ఏఐ కంప్యూటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. అంటే ఇకపై ఏఐకి కరెంట్ బిల్లు ఎంత వస్తుందోనని భయపడాల్సిన అవసరం లేకుండా అంతరిక్షంలోని సూర్యుడినే పవర్ బ్యాంక్‌గా మార్చుకోవాలన్నది మస్క్ ఆలోచన అంటున్నారు.తక్కువ ఖర్చుతోనే అంతరిక్షంలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్లాన్స్ వేస్తున్నారు.

ఆకాశంలోనే ఏఐ డేటా ప్రాసెసింగ్

ఈ ఉపగ్రహాలు కేవలం ఆకాశంలో తిరుగుతూ భూమిని ఫొటోలు తీసే పనికే పరిమితం కావు. భారీ మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయడం, ఏఐ మోడళ్లకు అవసరమైన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించడం వీటి ప్రధాన లక్ష్యం. అక్కడ తయారైన ఫలితాలను తిరిగి భూమిపైకి పంపించేలా వ్యవస్థను రూపొందించాలనుకుంటున్నారు. సన్ సింక్రోనస్ వంటి కక్ష్యల్లో ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతర సౌరశక్తిని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు.అయితే ఇదంతా రేపో మాపో జరిగిపోయే వ్యవహారం కాదు. ఎఫ్‌సీసీ నిబంధనల ప్రకారం 2033 నవంబర్ నాటికి ఉపగ్రహాల ప్రయోగాలను ప్రారంభించాలి. 2035 నవంబర్ నాటికి కనీసం 10 శాతం, 2038 నవంబర్ నాటికి 50 శాతం ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలి. అంటే లక్షలాది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం మస్క్‌కు మరో భారీ సవాలే..


అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్ తప్పదా..?

ఇప్పటికే అంతరిక్షంలో వేలాది ఉపగ్రహాలు ఉన్నాయి. రాబోయే కాలంలో పది లక్షల ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్తే కక్ష్యల్లో రద్దీ ఎలా ఉంటుందనే దానిపై చర్చ మొదలైంది. వాటి నిర్వహణ ఎలా సాగుతుంది.. ఉపగ్రహాల నుంచి వెలువడే టెంపరేచర్‌ను ఎలా బయటకు పంపిస్తారనే దానిపై శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఏదేమైనా మస్క్ ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో డేటా సెంటర్ నిర్మించాలంటే భూమ్మీద స్థలం కోసం వెతకాల్సిన అవసరం ఉండదేమో అనిపిస్తోంది.

ఇప్పటివరకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం వెతికాం.. కంపెనీలు ఫ్యాక్టరీల కోసం భూములు వెతికాయి. ఇక టెక్ కంపెనీలు మాత్రం ఏఐ డేటా సెంటర్ల కోసం అంతరిక్షంలో స్థలాలు వెతికే రోజులు వచ్చినట్టున్నాయి. మస్క్ ప్లాన్ విజయవంతమైతే ఏఐ ప్రపంచానికి కొత్త దారి తెరుచుకుంటుంది. లేదంటే భూమ్మీద ట్రాఫిక్ జామ్‌లతో విసిగిపోయిన మనకు అంతరిక్షంలోనూ ఉపగ్రహాల ట్రాఫిక్ జామ్ తప్పదేమో..