అక్రమ సంబంధం విలువ రూ.18 లక్షల కోట్లు…?
Jensen Huang Loses $7.4 Billion: ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ పెట్టుకున్న అక్రమ సంబంధం విలువ రూ.18 లక్షల కోట్లు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది. చైనా స్పైతో రిలేషన్లో ఉండటంతో కంపెనీకి రూ.18 లక్షల కోట్ల నష్టం జరిగింని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Jensen Huang Loses $7.4 Billion: ఒకే ఒక్క కారణం.. కట్టుకున్న భార్య కంటే పరాయి మహిళ అందంగా కనిపించడంతో ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్. దీంతో ఆయన ఇన్నాళ్లుగా సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు గంగలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆయన పేరు పోతే పోయింది.. కానీ ఇన్వెస్టర్ల సంపద మాత్రం భారీగా ఆవిరైపోయింది. కోటి కాదు, పది కోట్లు కాదు, వందల కోట్లు కాదు, వేల కోట్లు కాదు.. ఏకంగా రూ.18 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెన్సన్ వ్యక్తిగత వ్యవహారంపై వచ్చిన ఆరోపణలే ఈ పరిస్థితికి కారణమని కొందరు మండిపడుతున్నారు.
ఒక్కరోజులో 4.27 శాతం పడిపోయిన ఎన్విడియా షేర్లు
ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియాకు ఒక్కరోజులో భారీ నష్టం వాటిల్లింది. ఆ సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై వచ్చిన వివాదాస్పద ఆరోపణలు, కంపెనీ బోర్డు ప్రారంభించిన అంతర్గత దర్యాప్తు ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమయ్యాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లో సోమవారం ఎన్విడియా షేర్లు 4.27 శాతం పడిపోయాయి. ఈ పతనంతో కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 190 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.18 లక్షల కోట్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ సుమారు 4.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
జెన్సన్ హువాంగ్ సంపద కూడా పాయె..!
ఎన్విడియా షేర్ల పతనం జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత సంపదపైనా ప్రభావం చూపింది. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం.. నవంబర్ 9న ఆయన సంపద 6.8 బిలియన్ డాలర్లు తగ్గి 155.4 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదో స్థానం నుంచి పదో స్థానానికి దిగజారారు. వారెన్ బఫెట్, లారీ ఎలిసన్ ఆయనను అధిగమించారు. హువాంగ్ సంపదలో ఎక్కువ భాగం ఎన్విడియాలో ఆయనకున్న 3.5 శాతానికి పైగా వాటా నుంచే వస్తోంది. అందుకే షేర్ల ధరలో మార్పులు ఆయన సంపదపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఫలితంగా ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం పోయాయని ఎన్విడియా కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
నవంబర్ 17న ఏం జరగనుంది..?
ఎన్విడియా షేర్లపై ఒత్తిడికి హువాంగ్ వ్యవహారంతో పాటు ఏఐ రంగంపై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనలు కూడా కారణమవుతున్నాయి. డేటా సెంటర్ల నిర్మాణం, విద్యుత్ వినియోగం, ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయా.. అనే సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. మరోవైపు అమెరికా-చైనా మధ్య చిప్ ఎగుమతులపై ఆంక్షలు, నియంత్రణలు మరింత కఠినమయ్యే అవకాశం కూడా ఎన్విడియాకు సవాలుగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. నవంబర్ 17న ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ ఫలితాలతో పాటు దర్యాప్తులో వెలువడే అంశాలు కంపెనీ షేర్ల తదుపరి కదలికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
అలైస్ హువాంగ్‌తో జెన్సన్కు పరిచయం ఇలానే…
చైనాకు చెందిన అలైస్తో జెన్సన్ హువాంగ్‌కు పరిచయంపై అంతర్జాతీయ మీడియా కథనాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ కంపెనీలో అలైస్ కీలక ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన కంపెనీకి ఏఐ చిప్‌లు కావాలంటూ ఆ సంస్థ ద్వారా చర్చలు జరిపిన సమయంలో జెన్సన్‌తో అలైస్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్‌ల తయారీలో ఎన్విడియా అగ్రస్థానంలో ఉంది. అయితే చైనాకు చిప్‌ల సరఫరాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో ఎన్విడియా ఏఐ చిప్‌లు చైనాకు వెళ్తున్నట్లు అమెరికా సీఐఏ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో అలైస్ కదలికలపై నిఘా పెట్టగా.. జెన్సన్‌తో ఆమెకు సంబంధం ఉన్నట్లు బయటపడింది. వీరిద్దరూ కలిసి పలు ప్రాంతాలకు వెళ్లడంతో పాటు పార్టీలకు హాజరైనట్లు గుర్తించారని, చివరకు కొన్ని ద్వీపాలకు కలిసి వెళ్లి రోజుల తరబడి అక్కడే గడిపినట్లు అమెరికా నిఘా విభాగం గుర్తించింది.
ఏఐ చిప్‌లు చైనాకు వెళ్తే అమెరికాకు ప్రమాదమా..?
ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో అమెరికా ముందంజలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేయడానికి ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు, సహాయ సహకారాలు అందిస్తోంది. ఏఐ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం కూడా అందిస్తోంది. ఈ క్రమంలో ఎన్విడియాకు చెందిన ఏఐ చిప్‌లు చైనాకు చేరితే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై అమెరికా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే చైనా నుంచి అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని అగ్రరాజ్యం అనుమానిస్తోంది. అయితే ఎన్విడియా నుంచి ఎలాంటి సమాచారం లీక్ అయిందనే అంశంపై అటు అధికారులు, ఇటు ట్రంప్ యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. పైకి ధీమాగా కనిపిస్తున్నప్పటికీ, లోలోపల అమెరికా వర్గాల్లో ఆందోళన నెలకొందని సమాచారం.



