మీ వాట్సాప్ మెసేజ్‌లు సేఫ్‌గానే ఉన్నాయా..?
AI Verifies WhatsApp and Signal: మెసేజింగ్ యాప్‌లో ఉన్న మేటర్‌ను ఇతరు హ్యాక్ చేయడానికి అవకాశం లేదని ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు స్వరాట్ చౌదరి తెలిపారు.

AI Verifies WhatsApp and Signal: వాట్సాప్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లలో జరిగే చాటింగ్ ఎంత సురక్షితమనే అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ డీప్‌మైండ్ పరిశోధన నిర్వహించింది. ఈ సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఆయా యాప్‌లు వినియోగించే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ రక్షణ వ్యవస్థను అత్యంత కఠినంగా పరీక్షించింది. ఆల్ఫాప్రూఫ్ అనే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసింది.
లోపాలు లేవని నిరూపించిన స్వరాట్ చౌదరి
ముఖ్యంగా, సిగ్నల్ యాప్ ఉపయోగించే క్లిష్టమైన క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్‌ను ఈ ఏఐ వ్యవస్థ మెషిన్ కోడ్ స్థాయి వరకు క్షుణ్ణంగా వెరిఫై చేసింది. ఈ వివరాలను డీప్‌మైండ్ ప్రముఖ శాస్త్రవేత్త స్వరాట్ చౌదరి సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు. వాట్సాప్, సిగ్నల్ యాప్‌ల ఎన్క్రిప్షన్ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని తాము నిరూపించినట్లు వెల్లడించారు. ఈ మెసేజింగ్ యాప్‌ల రక్షణ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని, వీటిలోని చాటింగ్‌ను ఇతరులు హ్యాక్ చేయడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
నాలుగువారాల్లోనే వెరిఫికేషన్ పూర్తి
సాధారణంగా ఒక సాఫ్ట్వేర్ కోడ్ గణితశాస్త్ర పరంగా భద్రమైనదని నిరూపించడానికి దశాబ్దాల సమయం పడుతుంది. అయితే, గూగుల్ డీప్‌మైండ్‌కు చెందిన ఆల్ఫాప్రూఫ్ ఏఐ వ్యవస్థ ఈ బృహత్తర కార్యాన్ని కేవలం నాలుగు వారాల్లోనే పూర్తి చేసింది. మానవ నిపుణుల పర్యవేక్షణలో పనిచేసిన ఈ అధునాతన ఏఐ మోడళ్లు కోడ్‌ను అత్యంత విస్తృతంగా, లోతుగా తనిఖీ చేశాయి. ఈ భారీ పరిశోధనలో భాగంగా కోడ్‌బేస్‌లోని కేవలం ఒక శాతం భాగాన్ని మాత్రమే నిపుణులు పరిశీలించారు. మిగతా కోడింగ్ విశ్లేషణ, తనిఖీలను ఏఐ ఫ్రేమ్‌వర్క్ నిర్వహించింది. ఈ తరహా ఆటోమేటెడ్ వెరిఫికేషన్ విధానం ద్వారా సైబర్ భద్రతా రంగంలో సరికొత్త మైలురాయిని సాధించామని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాఫ్ట్వేర్ కోడ్ ధృవీకరణ ప్రక్రియలో ఇంత వేగవంతమైన ఫలితాలు రావడం ఇదే తొలిసారని పరిశోధకులు తెలిపారు.
ఉద్దేశపూర్వకంగా బగ్‌లు ప్రవేశపెట్టి మరీ టెస్టింగ్
ఏఐ సరిగ్గా, నిష్పాక్షికంగా పనిచేస్తుందా లేదా అనే సందేహాలను నివృత్తి చేయడానికి శాస్త్రవేత్తలు మరో కీలక పరీక్ష నిర్వహించారు. తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి అదే సాఫ్ట్వేర్ కోడ్‌లో ఉద్దేశపూర్వకంగా రెండు కొత్త బగ్‌లను ప్రవేశపెట్టారు. అయితే, ఏఐ వ్యవస్థ ఆ బగ్‌లను ఎంతో సులభంగా, క్షణాల వ్యవధిలో గుర్తించింది. ఈ పరీక్షతో కృత్రిమ మేధ సామర్థ్యంపై, అలాగే అది అందించిన ఫలితాలపై శాస్త్రవేత్తలకు నమ్మకం ఏర్పడింది. ఈ పరిశోధన ద్వారా సాఫ్ట్వేర్ కోడ్ గణితశాస్త్ర సూత్రాల ప్రకారం లోపరహితంగా ఉందని స్పష్టమైనట్లు పరిశోధకులు వెల్లడించారు. దీంతో కోట్ల మంది వినియోగదారులు ఉపయోగించే ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల గోప్యతకు ముప్పు లేదని పేర్కొన్నారు.



