ఏఐ ఎఫెక్ట్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మెడపై కత్తి..!
Microsoft layoffs: ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. అంతర్జాతీయ కంపెనీల నుంచి జాతీయ కంపెనీల వరకు ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇస్తున్నాయి. భారత్‌కు చెందిన ఇన్నోడేటా ఇండియా కంపెనీ అయితే, ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే 550 మంది ఉద్యోగులను తొలగించింది.

Microsoft layoffs: అమెరికా నుంచి హైదరాబాద్ వరకు లేఆఫ్‌ల కలకలం రేపుతున్నాయి. ఉద్యోగం ఉంటుందో లేదోనని సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈఎంఐల భారం.. భవిష్యత్తుపై భయం నెలకొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలియాస్ ఏఐ (AI) వచ్చిన తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఏఐని అభివృద్ధి చేసే పనిలో భాగంగా పలు కంపెనీలు ఉద్యోగులను నెమ్మదిగా తొలగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ కంపెనీలు అయితే దయచేసి మీరు మరో ఉద్యోగాన్ని వెతుక్కోండి అంటూ నేరుగా ఉద్యోగులకు చెప్పేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా కంపెనీని నమ్ముకొని ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇన్నాళ్లు నేను కంపెనీకి ప్రాణం పెట్టి పని చేశాను, రోజు పన్నెండు నుంచి 14 గంటల పాటు పని చేశానని తోటి ఉద్యోగుల దగ్గర చెప్పుకుంటూ బాధపడిపోతున్నారు. కలిసిమెలిసి సన్నిహితంగా తిరిగిన హెచ్‌ఆర్, ఇతర సీనియర్ ఉద్యోగులను ఇప్పుడు శత్రువులుగా చూసే పరిస్థితి నెలకొంది.
అమెరికా నుంచి హైదరాబాద్ వరకు తొలగింపులు
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్నది ఏదైనా ఉందంటే అది లేఆఫ్‌లు (layoffs) మాత్రమే. అందులో మరీ ముఖ్యంగా ఒరాకిల్, మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. దయచేసి మీరు ఇంకో ఉద్యోగాన్ని వెతుక్కోండి.. మీకు కొన్ని నెలల జీతాన్ని ఇస్తామంటూ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ (Microsoft layoffs) ఉద్యోగుల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు (layoffs) సన్నాహాలు చేస్తోంది. పైగా “మీకు డిసెంబర్ నాటికి ఎగ్జిట్ ఆఫర్‌ను” సైతం ఇచ్చింది. మీరు ఆప్షన్ ఎంచుకుంటారా..? లేదా మా ఆప్షన్ మీకు ఇవ్వమంటారా అంటూ తేల్చి చెప్పింది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా మైక్రోసాఫ్ట్‌లో (Microsoft layoffs) పని చేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఎగ్జిట్ ఆఫర్‌లో ఎవరి పేరు బయటకు వస్తుందనే దానిపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఈ ఆఫర్ ప్రకటించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అమెరికా, బ్రిటన్, కెనడాలో పని చేస్తున్న ఉద్యోగుల్లో భారతీయులు అత్యధికంగా ఉన్నారు.
చిన్న మెసేజ్ లేకుండా 550 మంది ఉద్యోగులు తొలగింపు
అమెరికాలో న్యూజెర్సీ కేంద్రంగా పని చేస్తున్న ఇన్నోడేటా ఇండియా (Innodata layoffs) సైతం 550 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ సర్వీస్‌లో ముందంజలో ఉన్న ఈ కంపెనీకి భారత్‌లో భారీగా ఉద్యోగులు ఉన్నారు. ఎంప్లాయిస్ అందరూ మధ్యాహ్నం లంచ్ చేసి తిరిగి వర్క్ చేద్దామనుకునే సమయంలో వారి ల్యాప్‌ట్యాప్‌ల్లో అప్లికేషన్లు లాగౌట్ అయ్యాయి. టెక్నికల్ ఎర్రర్ అని భావించిన ఉద్యోగులకు చావు కబురు చల్లగా చెప్పినట్లు.. మీ ఉద్యోగం పోయింది.. మీ సేవలు ఇక చాలు అంటూ కంపెనీ హెచ్‌ఆర్ మౌఖికంగా చెప్పి వెళ్లిపోయినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో అప్పటి వరకు సరదా సరదాగా గడిపిన ఉద్యోగులంతా కన్నీళ్లు పెట్టుకొని వెనుదిరిగినట్లు సమాచారం. సాయంత్రానికి కల్లా అందరి మెయిల్స్‌కు ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం వచ్చిందని ఇన్నోడేటా ఇండియా (Innodata layoffs) కంపెనీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితులంతా ఒక గ్రూపు ఏర్పాటు చేసుకొని.. కంపెనీకి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగం పోయింది.. ఈఎంఐల భారం
పలు కంపెనీల లేఆఫ్‌ల కారణంగా చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు (Microsoft layoffs) కోల్పోయారు. అయితే లక్షల్లో జీతం వస్తుండటంతో ప్రతి ఒక్కరూ మెట్రో నగరాల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లతో పాటు కార్లు, బైకులు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా ఉద్యోగం పోవడంతో భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఒకటి రెండు నెలల పాటు ఈఎంఐలను మేనేజ్ చేయొచ్చని.. ఉద్యోగం రాకపోతే తమ పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. ఉద్యోగం ఉన్నప్పుడు నెలనెలా వచ్చే జీతంతో కుటుంబ ఖర్చులు, ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఇంటి రుణం, కారు ఈఎంఐలు సాఫీగా సాగిపోతాయి. కానీ ఒక్కసారిగా ఉద్యోగం పోతే ఈ లెక్కలన్నీ తలకిందులవుతాయని చెబుతున్నారు. చేతిలో ఉన్న పొదుపు కొద్ది నెలలకే కరిగిపోతే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఉద్యోగులను వెంటాడుతోంది. ముఖ్యంగా భారీ జీతాలు అందుకుంటున్న ఉద్యోగులు తమ జీవనశైలికి తగ్గట్టుగా తీసుకున్న ఆర్థిక బాధ్యతల కారణంగా మరింత ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోతే కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలనే ప్రశ్న వారిని వేధిస్తోంది.
ఏఐతో ఉద్యోగాలకు ముప్పేనా?
ఏఐ (AI) వినియోగం పెరుగుతున్న కొద్దీ సాఫ్ట్‌వేర్ (software) రంగంలో పని చేసే విధానాలు మారుతున్నాయి. గతంలో ఎక్కువ మంది ఉద్యోగులు కలిసి పూర్తి చేసిన పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ సాయంతో తక్కువ సమయంలో పూర్తి చేసే అవకాశం ఏర్పడుతోంది. దీంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల అవసరాన్ని పునఃసమీక్షిస్తున్నాయి. వ్యాపార వ్యూహాల్లో మార్పులు, ఖర్చులను తగ్గించుకోవడం, పునర్వ్యవస్థీకరణ, మార్కెట్ పరిస్థితులు కూడా ఉద్యోగాల కోతకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ (software) రంగంలో ఉద్యోగం వస్తే జీవితానికి భరోసా లభించినట్లేననే అభిప్రాయం ఉండేది. భారీ జీతాలు, విదేశీ అవకాశాలు, మెరుగైన జీవనశైలి కారణంగా ఈ రంగం వైపు యువత పెద్దఎత్తున ఆకర్షితులయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే కంపెనీలో పనిచేసిన అనుభవం ఉన్నా ఉద్యోగం ఉంటుందనే హామీ లేకపోవడంతో ఉద్యోగ భద్రతపై కొత్త చర్చ మొదలైంది.
నిద్రలేని రాత్రులు గడుపుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
ఏఐ సాఫ్ట్‌వేర్ రంగంలో (AI) కొత్త అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ, కొన్ని ఉద్యోగాల స్వరూపాన్ని మార్చడంతో పాటు ఉద్యోగులపై అనిశ్చితిని పెంచుతోంది. ఒకప్పుడు ఉద్యోగం వస్తే చాలు అనుకునే పరిస్థితి నుంచి.. వచ్చిన ఉద్యోగాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఉద్యోగం పోతే మరో అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి అనే దిశగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే లేఆఫ్‌ల భయంతో ఉద్యోగులు మాత్రమే తమను తాము సిద్ధం చేసుకోవడం కాకుండా, కంపెనీలు కూడా సాంకేతిక మార్పుల సమయంలో ఉద్యోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అసోసియేషన్ కోరుతోంది. రాత్రికి రాత్రికి లేఆఫ్‌లు ఇస్తే ఉద్యోగి పరిస్థితి ఏంటనే దానిపై కంపెనీలు ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు..



