ఆరంభానికి ముందే “టెంపుల్” గ్యాడ్జెట్ చుట్టూ వివాదం
Deepinder Goyal Temple Device: దీపిందర్ గోయల్ తయారు చేయించిన టెంపుల్ డివైజ్ చుట్టూ ఇప్పుడు వివాదం నెలకొంది. శాస్త్రీయ ఆధారాలు చూపించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. వైద్యులపై ఓ రేంజ్లో విమర్శలు గుప్పించిన దీపిందర్.. తర్వాత సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.

Deepinder Goyal Temple Device: స్మార్ట్ వాచ్‌లు వచ్చాయి.. స్మార్ట్ రింగులు వచ్చాయి.. గుండె కొట్టుకునే వేగం నుంచి నిద్ర, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిల వరకు ఎన్నో ఆరోగ్య వివరాలను మన చేతికే అందిస్తున్నాయి. కానీ ఇప్పుడు అంతకుమించి మరో అడుగు ముందుకేసిన ఓ కొత్త గ్యాడ్జెట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అదే టెంపుల్ డివైజ్. ఏకంగా మన మెదడులో రక్తప్రసరణను పర్యవేక్షిస్తుందని ఈ పరికరం తయారు చేసిన కంపెనీ చెబుతోంది. ఇంతకీ ఈ సంస్థ వెనుక ఉన్నది ఎవరో తెలుసా..? జొమాటో వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన దీపిందర్ గోయల్. కేవలం రూ.85 వేలు పెడితే చాలు మెదడులో రక్తప్రసరణను కొలుస్తుందని బల్లగుద్ది చెప్పారు. అయితే టెంపుల్ డివైజ్‌పై వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. త్వరలో ఇస్తాం.. పేపర్లు బయటపెడతామంటూ ఎక్స్ వేదికగా పోస్టులు చేస్తున్నారు దీపిందర్ గోయల్. ఇంతకీ ఈ డివైజ్ ఎలా పని చేస్తుంది..? వైద్యుల ఆరోపణలు ఏంటి..? ఇప్పుడు ఈ కథనంలో చూద్దాం..
టెంపుల్ డివైజ్ వెనుక జొమాటో
జొమాటో మనందరికీ సుపరిచితమైన యాప్. మనకిష్టమైన ఫుడ్‌ను.. మనకిష్టమైన ప్లేస్‌లో ఆర్డర్ పెట్టుకునే అవకాశం కల్పించిన యాప్ జొమాటో. అలాంటి యాప్‌ను స్టార్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు దీపిందర్ గోయల్. అయితే కొన్నాళ్ల క్రితం జొమాటో నుంచి బయటకు వచ్చిన దీపిందర్ గోయల్.. టెంపుల్ డివైజ్‌ను తయారు చేసే పనిలో తన టీమ్ నిమగ్నమై ఉందని తెలిపారు. త్వరలో మార్కెట్లోకి వస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా ముందస్తుగా ప్రముఖ షట్లర్ పీవీ సింధూతో పాటు.. పలువురు క్రికెటర్లకు ఈ టెంపుల్ డివైజ్‌ను ఇచ్చారు. అయితే ఈ డివైజ్‌ను వాచ్ మాదిరిగా పెట్టుకోవాల్సిన పని లేకుండానే.. జస్ట్ నుదుటన బొట్టు పెట్టుకున్నట్లు అలా పెట్టేసుకుంటే చాలు అని చెప్పేశారు. దీంతో టెంపుల్ గ్యాడ్జెట్ కాస్తా సోషల్ మీడియా ట్రెండ్‌గా మారిపోయింది. ఇది సాధారణ వేరబుల్ డివైజ్‌లకు భిన్నంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. దీనిలోని బ్రెయిన్ ఫ్లో టెక్నాలజీ ద్వారా మెదడుకు సంబంధించిన రక్తప్రసరణ, ఆక్సిజన్ స్థాయిలు వంటి అంశాలను పర్యవేక్షించవచ్చని గోయల్ వివరిస్తున్నారు.
ప్రీ బుకింగ్స్ ఓపెన్.. రూ.85 వేలుగా రేట్ ఫిక్స్
టెంపుల్ డివైజ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన దీపిందర్ గోయల్ ప్రీ బుకింగ్స్‌ను తీసుకున్నారు. అయితే దీనిపై వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్యులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మెదడులో రక్తప్రసరణను టెంపుల్ డివైజ్ కొలుస్తున్నట్లు చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఈ పరికరం మెదడు పనితీరును అంచనా వేస్తుందని నిరూపించే పీర్ రివ్యూ పరిశోధనలు, వైద్యపరమైన ఫలితాలు అందుబాటులో లేవని విమర్శిస్తున్నారు. మరో అడుగు ముందుకేసిన ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ సైరియాక్ అబ్బీ ఫిలిప్స్ టెంపుల్ డివైజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ది లివర్ డాక్‌గా గుర్తింపు పొందిన ఆయన.. దీపిందర్ గోయల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. టెంపుల్ డివైజ్ మెదడులో రక్తప్రసరణను కొలవడం లేదని, ముఖం, చర్మం, పైపొరల్లోని రక్తప్రసరణలో వచ్చే మార్పులను మాత్రమే గుర్తిస్తోందని ఆరోపించారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు, ముఖం మరియు తలపై చర్మానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు వేర్వేరని కుండబద్దలు కొట్టేశారు. మరో స్కామ్ చేయడానికి ఇలాంటి డివైజ్‌లను తీసుకువచ్చారంటూ మండిపడ్డారు.
వైద్యులపై విమర్శలు.. తర్వాత క్షమాపణలు
టెంపుల్ డివైజ్‌పై సోషల్ మీడియాతో పాటు వైద్యులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో దీపిందర్ గోయల్ ఎక్స్ వేదికగా డాక్టర్లపై విమర్శలు గుప్పించారు. ఈ డివైజ్ కోసం తాను ఇప్పటి వరకు కోట్లాది రూపాయలను ఖర్చు చేశానని.. వైద్యులను తన డివైజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ప్రజలకు చెబుతానంటూ మండిపడుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కొంతమంది వైద్యులు ఏకంగా దీపిందర్ గోయల్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ముందు ఆధారాలు చూపించాలని.. తర్వాత ప్రశ్నలు వేయండి అంటూ ఓ డాక్టర్ డిమాండ్ చేశారు. వైద్యుల నుంచి వస్తున్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిన దీపిందర్ గోయల్.. డాక్టర్లకు క్షమాపణలు చెప్పడమే కాకుండా.. త్వరలో శాస్త్రీయ ఆధారాలను బయటపెడతామన్నారు. అంతేకాకుండా బుకింగ్స్ తీసుకున్నవారికి రీఫండ్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
Pre-order at https://t.co/hi9q1VXygW; first 10,000 orders never pay a subscription to use Temple.
— Deepinder Goyal (@deepigoyal) November 6, 2026
వివాదాస్పద పరికరంగా నిలిచిన టెంపుల్
మొత్తానికి టెంపుల్ ఇప్పుడు ఒక గ్యాడ్జెట్ వివాదాన్ని దాటి.. ఆరోగ్య రంగంలో కొత్త టెక్నాలజీల విశ్వసనీయతపై పెద్ద చర్చకు తెరలేపింది. ఒకవైపు మెదడు ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నామంటున్న గోయల్.. మరోవైపు ఆ టెక్నాలజీ చెబుతున్న కొలతలకు శాస్త్రీయ ఆధారాలు చూపించాలంటున్న వైద్య నిపుణులతో సంచలనంగా మారింది. ప్రస్తుతానికి రూ.85 వేల టెంపుల్.. ఆరోగ్య సాంకేతికతలో కొత్త ఆశగా కనిపిస్తూనే.. శాస్త్రీయ నిరూపణ కోసం ఎదురుచూస్తున్న వివాదాస్పద పరికరంగా నిలిచింది.



