US Elections Impact on India: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘన విజయం సాధించడంతో ఆ దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు అవకాశం ఏర్పడిందన్న చర్చ మొదలైంది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కొనసాగుతున్నప్పటికీ, చట్టసభలపై డెమోక్రాట్ల నియంత్రణ పెరగడం ఆయన నిర్ణయాలకు అడ్డంకిగా మారవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్యం, వలస విధానాలు, రక్షణ సహకారం, అంతర్జాతీయ సంబంధాల విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నుంచి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలు భారత్‌తో పాటు అమెరికాలో నివసిస్తున్న భారతీయులపైనా ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెచ్-1బీ వీసాదారులకు ఊరట దక్కుతుందా..?

అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు సంబంధించి ఈ ఎన్నికల ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారుల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న కఠిన వలస విధానాలను డెమోక్రాట్లు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల బలం పెరగడం వల్ల భవిష్యత్తులో వీసా నిబంధనలు, వలస విధానాలకు సంబంధించిన చర్చల్లో భారతీయ నిపుణులకు కొంత సానుకూలత లభించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిపబ్లికన్లు తీసుకొచ్చే కఠిన వలస విధానాల ప్రతిపాదనలకు డెమోక్రాట్లు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో వలస విధానాలకు సంబంధించి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే సమయంలో డెమోక్రాట్ల నియంత్రణ భారతీయులకు కొంత ఉపశమనం కలిగించవచ్చని అంచనా వేస్తున్నారు.

వాణిజ్య సుంకాల విషయంలో భారత్‌కు ప్రయోజనం ఏంటి..?

ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా దిగుమతులపై ఏకపక్షంగా సుంకాలు విధించే విధానాన్ని డెమోక్రాట్లు ప్రశ్నించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా విధించే అధిక సుంకాలు భారతీయ ఎగుమతిదారులపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఈ అంశంపై చర్చలు పెరగడం భారత్‌కు కొంత వెసులుబాటు కలిగించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఇప్పటికే కీలక దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుంకాల విధానంపై చట్టసభల్లో సమీక్ష జరిగితే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలకు మరింత సమయం లభించవచ్చు. అలాగే భారత్‌కు ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాల దిశగా చర్చలు ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రష్యా చమురు కొనుగోళ్లపై ఒత్తిడి మరింత తగ్గిపోతుందా..?

భారత్‌కు అత్యంత కీలకమైన ఇంధన రంగంపైనా అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం ఉండవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న యుద్ధం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు కూడా భారత్‌కు సవాళ్లుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ, రక్షణ విధానాలపై డెమోక్రాట్ల ఆధిపత్యంలోని కాంగ్రెస్ మరింత నిఘా ఉంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్షుడి యుద్ధ అధికారాలు, విదేశాంగ నిర్ణయాలపై చర్చలు పెరిగితే అంతర్జాతీయ ఉద్రిక్తతల విషయంలో అమెరికా విధానాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇలాంటి పరిణామాలు చమురు ధరలపై ప్రభావం చూపితే భారత్‌కు ప్రయోజనం కలగవచ్చు. ప్రపంచంలోనే ప్రధాన ఇంధన దిగుమతి దేశాల్లో ఒకటైన భారత్‌కు చమురు ధరలు తగ్గడం లేదా స్థిరంగా ఉండటం ఆర్థికంగా కీలకం. అయితే ఈ విషయంలో ఎన్నికల ఫలితాల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది అమెరికా తదుపరి విధానాలపై ఆధారపడి ఉంటుంది.

స్టాక్‌మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి

అమెరికా రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. డాలర్ విలువ, అమెరికా బాండ్ ఈల్డ్స్‌లో మార్పులు భారత రూపాయి స్థిరత్వంపై ప్రభావం చూపుతాయి. డాలర్ బలహీనపడటం, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహంలో మార్పులు చోటుచేసుకోవడం వంటి పరిణామాలు భారత మార్కెట్లకు అనుకూలంగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆర్థిక, వాణిజ్య విధానాలపై అనిశ్చితి తగ్గితే విదేశీ పెట్టుబడిదారుల వైఖరిలోనూ మార్పులు రావచ్చు. దీనివల్ల భారత స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే రూపాయి విలువ, స్టాక్ మార్కెట్ల కదలికలు కేవలం అమెరికా ఎన్నికల ఫలితాలపైనే కాకుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, చమురు ధరలు వంటి ఇతర అంశాలపైనా ఆధారపడి ఉంటాయి.

భారత్-అమెరికా సంబంధాల్లో మార్పులు ఖాయం..?

మొత్తంగా చూస్తే అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు భారత్‌కు కొన్ని కీలక అంశాల్లో సానుకూల పరిణామాలకు దారితీయవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హెచ్-1బీ వీసాలు, వలస విధానాలు, వాణిజ్య సుంకాలు, రష్యా చమురు కొనుగోళ్లు, రక్షణ సహకారం వంటి అంశాల్లో కాంగ్రెస్ పాత్ర పెరగవచ్చు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ విధానాల్లో తక్షణమే పూర్తిస్థాయి మార్పులు వస్తాయని చెప్పలమంటున్నారు ప్రవాస భారతీయులు. ఈ నేపథ్యంలో డెమోక్రాట్ల విజయం భారత్‌కు తక్షణ ప్రయోజనాలను అందించకపోయినా, ట్రంప్ ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష ఆర్థిక, వాణిజ్య, వలస నిర్ణయాలపై నియంత్రణ పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో అమెరికా కాంగ్రెస్‌లో జరిగే చర్చలు, ట్రంప్ ప్రభుత్వ స్పందన, భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల సంబంధాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.