Mythri Movie Makers IPO: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాణ సంస్థల వ్యాపార విస్తరణ కొత్త దిశగా సాగుతోంది. ఇప్పటివరకు సినిమాల నిర్మాణం, పంపిణీ వంటి విభాగాలకే పరిమితమైన కొన్ని సంస్థలు.. ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన మైత్రీ మూవీ మేకర్స్ పేరు ఐపీఓ న్యూస్ తెరపైకి వచ్చింది. సుమారు రూ.3,500 కోట్ల విలువతో పబ్లిక్ ఇష్యూకు వెళ్లేందుకు సంస్థ సిద్ధమవుతోందనే ప్రచారం సినీ, వ్యాపార వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

స్టార్ హీరోలతో భారీ చిత్రాల నిర్మాణం

నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి స్థాపించిన మైత్రీ మూవీ మేకర్స్ అనతి కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. 2015లో మహేశ్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ.. ఆ తర్వాత వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించింది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకులతోనూ చిత్రాలను రూపొందించింది. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ నిర్మాణ కార్యకలాపాలను విస్తరించింది.

ప్రస్తుతం నాలుగు భారీ ప్రాజెక్టులు

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ రూపొందిస్తోంది. ఇక జై హనుమాన్ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని పట్టాలెక్కించే ప్రణాళికలో ఉంది.ఇలా ఒకేసారి పలు భారీ ప్రాజెక్టులను నిర్వహిస్తూనే ఇతర భాషల్లోనూ నిర్మాణ అవకాశాలను అన్వేషిస్తోంది. మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.3,500 కోట్ల వాల్యుయేషన్‌తో సంస్థ షేర్లను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.

ఫిల్మ్ స్టూడియో నిర్మాణమే టార్గెట్‌గా పెట్టుకున్నారా..?

మైత్రీ మూవీ మేకర్స్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలనే ఆలోచన వెనుక సంస్థ వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో సుమారు 260 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఫిల్మ్ స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో సంస్థ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ స్టూడియో ప్రాజెక్టుకు భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమవుతాయి. అదే సమయంలో సినిమా నిర్మాణాన్ని మరింత విస్తరించడం, ఇతర భాషల్లోనూ ప్రాజెక్టులు చేపట్టడం, నిర్మాణ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలూ ఉంటాయని ఫిల్మ్‌ జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించి సంస్థను మరింత పెద్ద కార్పొరేట్ నిర్మాణ సంస్థగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఐపీఓకు వెళ్లిన నిర్మాణ సంస్థలు

భారతీయ చిత్ర పరిశ్రమలో సినిమా నిర్మాణ సంస్థలు స్టాక్ మార్కెట్‌లోకి వెళ్లడం కొత్త విషయమేమీ కాదు. గతంలో జి. వెంకటేశ్ స్థాపించిన జీవీ ఫిలిమ్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా, రాడాన్ మీడియా వర్క్స్ వంటి సంస్థలు పబ్లిక్ ఇష్యూల ద్వారా స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించాయి. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సుభాష్ ఘాయ్‌కు చెందిన ముక్తా ఆర్ట్స్ కూడా పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. అలాగే ఏక్తా కపూర్‌కు చెందిన బాలాజీ టెలీఫిలిమ్స్ 2000 సంవత్సరంలోనే పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. మైత్రీ మూవీ మేకర్స్ ఐపీఓ వార్తలు నిజమైతే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో కీలక పరిణామానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు స్టార్ హీరోలు, దర్శకులు, భారీ బడ్జెట్ సినిమాల చుట్టూ తిరిగిన నిర్మాణ వ్యవస్థ.. మరింత విస్తృతమైన కార్పొరేట్ వ్యాపార నమూనా వైపు అడుగులు వేసే అవకాశం ఉంది.