Bhogi Movie Review: టాలీవుడ్‌లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే శర్వానంద్ ఈసారి పూర్తి మాస్ అవతారంలో భోగి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1960ల నాటి తెలంగాణ గ్రామీణ వాతావరణం, అప్పటి ఆచారాలు, మూఢనమ్మకాలు, నరబలుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు సంపత్ నంది ఈ కథ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడంతో పాటు, భారీ నిర్మాణ విలువలతో సినిమాను రూపొందించారు. శర్వానంద్ లుక్, టీజర్, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. శర్వానంద్ మాస్ ప్రయత్నం ఎంతవరకు ఫలించిందా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

భోగి కథ ఇదే..!

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని బొగ్గులగుంట అనే చిన్న తండా ఈ కథకు నేపథ్యం. అక్కడి ప్రజలు పేదరికంతో పాటు అనేక మూఢనమ్మకాల మధ్య జీవిస్తుంటారు. ఆ గ్రామంలో పటేల్ చెప్పిందే వేదం. గ్రామానికి ఏదైనా ఆపద వచ్చినా, అనుకోని సంఘటన జరిగినా దానికి కారణం దుష్టశక్తులేనని నమ్మిస్తుంటాడు. వాటి నుంచి బయటపడాలంటే నరబలులు ఇవ్వాలని గ్రామస్థులను భయపెడుతుంటాడు. అదే గ్రామంలో తన ఐదుగురు చెల్లెళ్లే ప్రపంచంగా గంగా (శర్వానంద్) జీవిస్తుంటాడు. గ్రామంలో అమాయక యువతులపై జరుగుతున్న దారుణాలను చూసి ఎదిరిస్తాడు. ఇకపై ఆడపిల్లల ప్రాణాలకు హాని కలిగించే వారిని వదిలిపెట్టనని పటేల్‌కు గట్టిగా హెచ్చరిస్తాడు. దీంతో గంగాపై పటేల్ కక్ష పెంచుకుంటాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న పటేల్.. చివరకు గంగా ఐదుగురు చెల్లెళ్లనే బలిపశువులుగా మార్చడంతో అతడి జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. కళ్లముందే తన కుటుంబాన్ని కోల్పోయిన గంగా ఏం చేశాడు.. పటేల్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు.. పోరాటంలో ఎదురైన పరిణామాలే మిగతా సినిమా కథ.

రక్తపాతాన్ని నమ్ముకున్న సంపత్ నంది

మూఢనమ్మకాలు, నరబలులు, పగ, ప్రతీకారం వంటి అంశాలను తీసుకొని దర్శకుడు సంపత్ నంది ఈ కథను రూపొందించారు. 1960ల కాలం నాటి తెలంగాణ గ్రామీణ జీవనశైలిని తెరపై చూపించడంలో దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోదగినది. అప్పటి వాతావరణం, ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలను చూపించేందుకు తీసుకున్న జాగ్రత్తలు తెరపై కనిపిస్తాయి. అయితే కథా పరంగా మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోదు. ముఖ్యంగా కథలోని ప్రధాన సంఘర్షణ బలంగా ఉన్నప్పటికీ, దాన్ని ఆసక్తికరమైన కథనంగా మలచడంలో కొన్ని లోపాలు కనిపిస్తాయి. మొదటి భాగంలోనే కథకు సంబంధించిన కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. అక్కడితో కథను ముగించే అవకాశం ఉన్నప్పటికీ, ద్వితీయార్ధంలో కొత్త ట్రాక్‌లు, అనవసరమైన మలుపులతో కథను మరింత సాగదీశారు.సెకండాఫ్‌లో వచ్చే కొన్ని పరిణామాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచినా, అవి కథకు ఎంతవరకు అవసరమనే సందేహం కలుగుతుంది. ప్రతీకార కథలో ఉండాల్సిన ఉత్కంఠను పూర్తిస్థాయిలో కొనసాగించలేకపోయారు. రక్తపాతం, హింసను ఎక్కువగా చూపించినప్పటికీ, అవి కథలో భావోద్వేగాలను బలంగా పండించలేకపోయాయి.

నటీనటుల నటన

శర్వానంద్ ఈ సినిమాలో తన గత చిత్రాలకు భిన్నంగా పూర్తి మాస్ పాత్రలో కనిపించారు. గంగా పాత్ర కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకొని రగ్గడ్‌గా కనిపించారు. అనుపమ పరమేశ్వరన్ తన గ్లామర్ ఇమేజ్‌కు భిన్నంగా డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించి మెప్పించారు. డింపుల్ హయాతి కూడా తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రను పోషించారు. మిగతా నటీనటులు సైతం తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. సాంకేతికంగా భోగి సినిమా మంచి ప్రమాణాలతో తెరకెక్కింది. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ప్లస్ పాయింట్స్

* శర్వానంద్ మాస్ లుక్, నటన

* 1960ల నాటి తెలంగాణ నేపథ్యం

* భీమ్స్ సిసిరోలియో సంగీతం

* సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

* సాగదీసిన కథనం

*రొటీన్ పగ, ప్రతీకార కథ

*హింస, రక్తపాతం మోతాదు ఎక్కువ కావడం

* ఎడిటింగ్‌లో లోపాలు

మొత్తంగా భోగి మంచి నేపథ్యంతో వచ్చినప్పటికీ, కథనం విషయంలో మరింత బలంగా ఉండాల్సిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా.