Movies releasing this week: గత వారం విడుదలైన ఎనిమిది సినిమాల్లో మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందనను సొంతం చేసుకున్నాయి. ఆకాశంలో ఒకతార, ఈఎన్ఈ రిపీట్‌, ఓం సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో టాలీవుడ్‌లో మళ్లీ సందడి మొదలైంది. ఈ ఉత్సాహం కొనసాగిస్తూ ఈ వారం మరోసారి భారీ సంఖ్యలో సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. స్ట్రెయిట్‌ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కలిపి మొత్తం 11 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో ప్రధాన ఆకర్షణగా శర్వానంద్ నటించిన భోగి నిలవనుంది.

భోగిపై భారీ అంచనాలు.. శర్వానంద్‌కు మరో పరీక్ష

ఈ ఏడాది శర్వానంద్‌కు బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన నారీ నారీ నడుమ మురారి కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన బైకర్ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోయినా, నటుడిగా శర్వానంద్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆయన భోగి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 1960 నాటి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు సంపత్ నంది ఈ కథను తెరకెక్కించారు. శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించగా, డింపుల్ హయతీ కీలక పాత్రలో కనిపించనుంది. శతమానం భవతి తర్వాత శర్వా, అనుపమ కలిసి నటిస్తున్న సినిమా కావడం మరో విశేషం.ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల దృష్టి కూడా భోగిపైనే ఉంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి హే కన్నమ్మా

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన వారసులతో కలిసి ప్రారంభించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఇప్పటికే బలగం, లవ్ మీ, జనక అయితే గనక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ నాలుగో ప్రయత్నంగా హే కన్నమ్మా సినిమాను విడుదల చేస్తోంది. మూడేళ్ల క్రితం ఆకాశం దాటి వస్తావా అనే పేరుతో ప్రారంభమైన ఈ సినిమాకు ఇప్పుడు హే కన్నమ్మా అనే కొత్త టైటిల్ ఖరారు చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. ధనశ్రీ వర్మ, కార్తీక మురళీధరన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కొత్త తరహా ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాకు శశికుమార్ ముత్తులూరి దర్శకత్వం వహించారు.

చిన్న సినిమాల నుంచి ప్రత్యేక చిత్రాల వరకు..

హే కన్నమ్మాతో పాటు ఈ శుక్రవారం మరికొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సిద్దుగాడి లవ్ స్టోరీ, బాల 369, హై, ఐ హేట్ మ్యారేజ్, డాడ్స్ లిటిల్ ఫ్రెండ్ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇక సీనియర్ నటీనటులు కలిసి నటించిన ఆలోచన సినిమా కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలితతో పాటు జీవీ నారాయణరావు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం జీవీ నారాయణరావు మన మధ్య లేకపోవడం ఈ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. సురేంద్ర చాచా దర్శకత్వం వహించారు. ఈ సినిమా విషయంలో చిత్రబృందం మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. విడుదలైన తొలి మూడు రోజుల పాటు సీనియర్ సిటిజన్లకు ఉచితంగా సినిమాను ప్రదర్శించనున్నారు. మరోవైపు డేంజర్ బాయ్స్ చిత్ర నిర్మాతలు కూడా ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆటను ప్రేక్షకులందరికీ ఉచితంగా చూపించనున్నట్లు వెల్లడించారు.

తెలుగులోకి ఫూలే.. జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం

ఈ వారం విడుదలవుతున్న 11 సినిమాల్లో తొమ్మిది స్ట్రెయిట్ చిత్రాలు కాగా, రెండు అనువాద సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఫూలే. ఇప్పటికే హిందీలో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ రూపొందించారు. సంఘ సంస్కర్తలు జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయి పూలే జీవిత ప్రయాణాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని పొన్నం రవిచంద్ర అందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సినిమాను వీక్షించి ప్రశంసించారు. సామాజిక మార్పు కోసం పూలే దంపతులు చేసిన కృషిని వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

ఎట్టకేలకు విడుదలైన విజయ్ ఆంటోని నాన్న కుట్టి

మరో అనువాద చిత్రం నాన్న కుట్టి. నటుడిగా, సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన విజయ్ ఆంటోని నటించి నిర్మించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదలైంది. గతంలో మదర్ సెంటిమెంట్‌తో రూపొందించిన వంద దేవుళ్లు సినిమా ఈ ఏడాది జూన్‌లో విడుదలైంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. ఈసారి తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకుని విజయ్ ఆంటోని నాన్న కుట్టిని రూపొందించారు. విజయ్ ఆంటోనితో పాటు ప్రీతి అస్రాని, లిథాన్య కీలక పాత్రల్లో నటించారు. ము. మారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ వారం విభిన్న కథాంశాలతో కూడిన 11 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. భారీ అంచనాలతో వస్తున్న భోగి, కొత్త ప్రేమకథగా తెరకెక్కిన హే కన్నమ్మా, చారిత్రక నేపథ్యం కలిగిన ఫూలే, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందిన నాన్న కుట్టి ప్రధాన ఆకర్షణలుగా కనిపిస్తున్నాయి.