Bigg Boss Telugu latest episode: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. హౌస్‌లో జరుగుతున్న టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య పోటీ, భావోద్వేగ పరిణామాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ఈ షోలో మాజీ కంటెస్టెంట్లు సందడి చేశారు. సిరి హనుమంత్, వీజే సన్నీ, నిఖిల్ మలియక్కల్, పృథ్వీ గెస్ట్‌లుగా హౌస్‌లోకి అడుగుపెట్టి ప్రస్తుత కంటెస్టెంట్లతో సరదాగా గడిపారు. పలు గేమ్స్‌లో పాల్గొంటూ హౌస్‌మేట్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ క్రమంలో జరిగిన ఓ ఫిజికల్ టాస్క్‌లో నరేష్ విజయం సాధించగా, ఓటమిని తట్టుకోలేక వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంది.

హౌస్‌లోకి సిరి, సన్నీ ఎంట్రీ.. కంటెస్టెంట్ల ఆటతీరుపై విశ్లేషణ!

ముందుగా మాజీ కంటెస్టెంట్లు సిరి హనుమంత్, వీజే సన్నీ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. వీరి రాకతో హౌస్‌లో సందడి మొదలైంది. ఈ సందర్భంగా సన్నీ ప్రస్తుత కంటెస్టెంట్ల ఆటతీరుపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒక్కొక్కరి ఆటను పరిశీలిస్తూ వారి బలాలు, బలహీనతలను ప్రస్తావించారు. దీంతో హౌస్‌మేట్స్‌కు తమ ఆటతీరుపై మరోసారి ఆలోచించే అవకాశం లభించింది. సిరి, సన్నీ వచ్చిన సందర్భంగా హౌస్‌లో ఓ ఫిజికల్ టాస్క్ నిర్వహించారు. ఈ పోటీలో వర్షిణి, సిరి ఒక జట్టుగా బరిలోకి దిగగా.. నరేష్, సన్నీ మరో జట్టుగా పోటీ పడ్డారు. ఈ గేమ్‌లో వేగం, ఫిజికల్ ఫిట్నెస్, సమన్వయం కీలకంగా మారాయి. టాస్క్‌లో భాగంగా నరేష్ తనకు ఎదురైన షీట్‌ను పగలగొట్టేందుకు వేగంగా ప్రయత్నించాడు. చివరకు దాన్ని బ్రేక్ చేసి బంతులను సన్నీకి అందించడంతో తన జట్టు విజయానికి బాటలు వేశాడు. మరోవైపు వర్షిణి మాత్రం షీట్‌ను పగలగొట్టేందుకు చాలా సమయం తీసుకుంది. ఆమె ఎంత ప్రయత్నించినా ఆశించిన వేగంతో టాస్క్‌ను పూర్తి చేయలేకపోయింది. ఈలోగా నరేష్ తన టాస్క్‌ను దాదాపుగా ముగించడంతో విజయం అతడి సొంతమైంది. ఈ గెలుపుతో నరేష్ కెప్టెన్సీ కంటెండర్‌గా అర్హత సాధించాడు.

సపోర్ట్ చేయడం లేదని ఏడ్చిన వర్షిణి..!

మరోవైపు ఈ టాస్క్‌లో ఓడిపోవడం వర్షిణిని తీవ్రంగా కలచివేసింది. గేమ్ ముగిసిన తర్వాత ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. తన ఆటతీరుపై హౌస్‌లో పలువురు విమర్శలు చేస్తున్నారని, ఫిజికల్ టాస్కులు ఆడటం లేదంటూ పదే పదే అంటున్నారని బాధపడింది. అయితే తాను నిజంగా టాస్క్ ఆడుతున్న సమయంలో మాత్రం తనకు అండగా నిలిచేవారు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ముకేష్ మినహా హౌస్‌లో మరెవరూ తనకు మద్దతుగా ఉండటం లేదని వర్షిణి చెప్పుకొచ్చింది. ఈ గేమ్‌లో కూడా అందరూ నరేష్‌కు సపోర్ట్ చేశారని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో హౌస్‌లో ఒక్కసారిగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. వర్షిణి ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేసిన సన్నివేశాలు ఈ ఎపిసోడ్‌లో ప్రత్యేకంగా నిలిచాయి.

శివ్‌ కోసం మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన ప్రియాంక జైన్

ఇదిలా ఉంటే, మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ వార్తల్లో నిలిచింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా శివ్ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అతడికి ప్రియాంక తన మద్దతు తెలుపుతోంది. ఇటీవల జరిగిన ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఆమె బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లి శివ్‌ను కలిసింది. ఆ సమయంలో వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా శివ్ బిగ్ బాస్ టైటిల్ గెలవాలనే ఆకాంక్షతో ప్రియాంక తిరుమల యాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకుంది. తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. శివ్ టైటిల్ గెలవాలని కోరుకుంటూ ప్రియాంక చేసిన ఈ యాత్ర ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

శుక్రవారం అసలైన కెప్టెన్సీ పోరు.. విజేత ఎవరు..?

ఇక నరేష్ కెప్టెన్సీ కంటెండర్‌గా అర్హత సాధించడంతో హౌస్‌లో కెప్టెన్సీ పోటీ మరింత రసవత్తరంగా మారింది. మరోవైపు నిఖిల్, సుధీర్ జట్టు విజయం కూడా ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. అయితే అసలు కెప్టెన్సీ టాస్క్ మాత్రం శుక్రవారం జరగనుంది.ఈ పోటీలో ఎవరు విజయం సాధించి హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. మాజీ కంటెస్టెంట్ల ఎంట్రీతో వచ్చిన ఉత్సాహం ప్రస్తుత కంటెస్టెంట్ల ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..కెప్టెన్సీ రేసులో ఎవరికి అవకాశం దక్కుతుంది..అన్నది తదుపరి ఎపిసోడ్‌లో చూడాలి.