US Flight Ground Stop: అమెరికాలో విమానయాన రంగంలో ఒక్కసారిగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

టెక్నికల్ సమస్యలే కారణమని వివరణ

ఈ పరిణామంపై అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫ్ఫీ, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ స్పందించారు. విమానయాన వ్యవస్థపై ఎలాంటి ఉద్దేశపూర్వక దాడి జరగలేదని, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వెల్లడించారు. ప్రయాణికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు.


వేల సంఖ్యలో విమానాలపై ప్రభావం

ఎఫ్ఏఏ నిర్ణయంతో అమెరికాలోని పలు విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 10 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడవగా, అనేక సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అయితే అప్పటికే గాల్లో ఉన్న విమానాలకు మాత్రం గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుమతించారు. విదేశాల నుంచి వచ్చే విమానాల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఉంచారు.

సాంకేతిక సమస్య పరిష్కారంతో సేవలు పునరుద్ధరణ

2023 జనవరి తర్వాత అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను నిలిపివేయడం ఇదే మొదటిసారి. అంతకుముందు 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టారు. కొన్ని గంటల పాటు కొనసాగిన అంతరాయం అనంతరం సాంకేతిక నిపుణులు సమస్యను సరిచేశారు. దీంతో ఎఫ్ఏఏ విమాన సర్వీసుల పునరుద్ధరణకు అనుమతించింది. ప్రస్తుతం విమానయాన సంస్థలు రద్దయిన, ఆలస్యమైన సర్వీసులను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.