Nvidia CEO scandal: జెన్సన్ హువాంగ్.. తన మేధస్సుతో ఎన్విడియా సంస్థను ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. ప్రపంచంలోని కంప్యూటర్లలో 70 శాతానికి పైగా సెమీకండక్టర్లు, ప్రాసెసర్లు ఎన్విడియావే ఉపయోగిస్తున్నారని పేర్కొంటున్నారు. అలాంటి సంస్థకు 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎంతటి మగాడైనా ఆడదాని అందానికి దాసుడే అన్నట్లు.. ఇప్పుడు ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ ఇద్దరు మహిళలతో సంబంధాలు కొనసాగించడం ఆ సంస్థను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒకరు అమెరికాకు ప్రత్యర్థి దేశమైన చైనాకు చెందిన అలిస్ హువాంగ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. ఇప్పుడు కింబర్లీ పోవెల్‌తోనూ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆయన పదవికి ఎసరు వచ్చే పరిస్థితి ఏర్పడింది.

జెన్సన్ చుట్టూ వివాదాలు..

సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్విడియా సంస్థలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదాలు ముసురుకోవడంతో ఆయన పదవికి ముప్పు ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. హువాంగ్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తప్పించే అంశాన్ని కంపెనీ డైరెక్టర్ల బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం. జెన్సన్ హువాంగ్‌కు ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు అమెరికా భద్రతా వర్గాల్లో చర్చకు దారితీశాయి. మెగాస్పేస్ అనే డేటా కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అలిస్‌తో హువాంగ్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆలిస్‌కు చైనా గూఢచార సంస్థలతో సంబంధాలు ఉండవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నట్లు సమాచారం.

మరో ఉద్యోగితో రిలేషన్‌లో ఉన్న జెన్సన్

చైనా వ్యవహారం చర్చనీయాంశంగా ఉండగానే ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన మరో కథనం టెక్ రంగంలో సంచలనం సృష్టించింది. ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పోవెల్‌తోనూ జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధం కొనసాగించినట్లు ఐదుగురు మాజీ ఉద్యోగులు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్‌ తెలిపింది. గత మార్చిలో సాన్‌జోస్‌లో నిర్వహించిన ఎన్విడియా సదస్సు సందర్భంగా హోటల్ ప్రాంగణంలో వీరిద్దరూ సన్నిహితంగా కనిపించినట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారంలో కంపెనీ నిబంధనలు కూడా చర్చకు వస్తున్నాయి. ఎన్విడియా కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, మేనేజర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తమకు నేరుగా రిపోర్ట్ చేసే ఉద్యోగులతో వ్యక్తిగత సంబంధాలు కొనసాగించడాన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో హువాంగ్‌పై వచ్చిన ఆరోపణలు కంపెనీలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


నాలుగు రోజుల్లో రూ.28 లక్షల కోట్ల సంపద ఆవిరి

ఎన్విడియా ప్రపంచవ్యాప్తంగా చిప్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. అలాంటి సంస్థ సీఈవో వ్యక్తిగత వ్యవహారాలు ఇప్పుడు కంపెనీకి నష్టాలు చేకూర్చేలా ఉన్నాయని కంపెనీ డైరెక్టర్లు చెబుతున్నారు. అమెరికా ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఇప్పటివరకు సుమారు రూ.28 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు సమాచారం. ఒక్క సమాచారం బయటకు రావడంతో కంపెనీ షేర్లు భారీగా పతనమవుతున్నాయని బోర్డు డైరెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే ప్రచారం సంచలనంగా మారింది. అయితే, ఈ నష్టాన్ని పూడ్చేందుకు అటు అధికారులు, ఇటు కంపెనీ యాజమాన్యం చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఎన్విడియాకు కొత్త సీఈవో..?

ఈ పరిణామాల నేపథ్యంలో జెన్సన్ హువాంగ్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించాలా..? లేక తాత్కాలికంగా మరొకరికి బాధ్యతలు అప్పగించాలా..? అనే అంశాలపై చర్చించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, హువాంగ్ స్థానంలో కొత్త సీఈఓను ఎంపిక చేసే బాధ్యతను ఎన్విడియా బోర్డు ఓ హెడ్‌హంటింగ్ సంస్థకు అప్పగించినట్లు అమెరికాలో సంచలనంగా మారింది..