‘డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కోసం ఎంపీలకు రూ.150 కోట్ల ఆఫర్’
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు వ్యవహారంలో విపక్ష ఎంపీలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు. ఒక్కో ఎంపీకి రూ.150 కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు కామెంట్లు చేశారు.

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ఎలాగైనా గట్టెక్కించాలనే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని శివసేన (ఉద్ధవ్) వర్గం ఎంపీ సంజయ్ రౌత్ శనివారం ఆరోపించారు. పార్లమెంట్లో ఈ బిల్లుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు విపక్ష ఎంపీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లకు ఆఫర్
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఉమ్మడిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రౌత్ ఆరోపించారు. అయితే ఈ బిల్లులకు రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ సాధించడం కేంద్రానికి సవాలుగా మారిందన్నారు. విపక్ష ఇండియా కూటమి ఐక్యంగా నిలవడంతో గతంలో కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బిల్లుకు మద్దతు ఇచ్చే ఎంపీలకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తున్నారని రౌత్ ఆరోపించారు. రెండు రోజుల క్రితం ఒక్కో ఎంపీకి రూ.100 కోట్ల ఆఫర్ ఇవ్వగా, ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.150 కోట్లకు పెంచినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో విపక్ష ఎంపీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అయితే ఈ ఆఫర్లు అందుకున్న ఎంపీల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు.
అమిత్ షా ముంబై పర్యటనలపై అనుమానాలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ ముంబైకి వస్తుండటంపై కూడా సంజయ్ రౌత్ ప్రశ్నలు లేవనెత్తారు. ఎంపీలను ప్రలోభపెట్టేందుకే ఆయన పర్యటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చేలా మహారాష్ట్రకు చెందిన నేతలను ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ బాధ్యతను రాష్ట్రంలోని పలువురు కీలక నేతలకు అప్పగించినట్లు ఆరోపించారు. గతంలో మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలను కూడా రౌత్ ప్రస్తావించారు. ఐదేళ్ల క్రితం ఒక్కో ఎమ్మెల్యేను రూ.50 కోట్లకు, ఎంపీని రూ.75 కోట్లకు కొనుగోలు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎంపీలకు ఆఫర్ చేస్తున్నట్లు చెబుతున్న రూ.150 కోట్ల మొత్తాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేతో జరిగిన ఒప్పందంలో భాగంగా తమ పార్టీని వీడిన ఆరుగురు ఎంపీలకు ఒక్కొక్కరికి రూ.80 కోట్లు చెల్లించారని కూడా ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్తో పోల్చారు.
మెజార్టీ సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు
పార్లమెంటును ఇప్పటి వరకు ప్రోరోగ్ చేయకపోవడంతో అక్టోబర్ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుల ఆమోదం కోసం ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులను వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించినా పలు కారణాల వల్ల ఈ ప్రతిపాదనను వాయిదా వేసింది. సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతోన్న వేళ ఈ బిల్లులు చర్చకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇప్పుడు సంజర్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.



