హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి,పెట్టుబడుల చర్చల కంటే రాజకీయ ఆరోపణలతోనే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీ హాజరుపై రాజకీయ రగడ.. విదేశీ ప్రతినిధుల వీసాల వివాదం.. అభివృద్ధి వేదికగా మొదలైన సదస్సు మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ కురుక్షేత్రంగా మారింది. ఈ సదస్సుతో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తాయని.. పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా భారత్ సమ్మిట్ నిలుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ స‌మ్మిట్‌పై బీజేపీ యుద్ధం ప్రకటించింది. రాష్ట్ర ప్రజల సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రచారం చేసుకుంటోందంటూ కమలం పార్టీ నేతలు విరుచుకుప‌డుతున్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడానికే ఈ సదస్సును వాడుకుంటున్నారని తెలంగాణ బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇది భారత్ సమ్మిట్ కాదని.. యాంటీ భారత్ సమ్మిట్ అంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. భారత వ్యతిరేక శక్తులకు ఈ సదస్సులో చోటు కల్పిస్తున్నారంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు విమర్శలు గుప్పించారు.

భారత్ సమ్మిట్‌పై బీజేపీ ఒకవైపు విమర్శలు చేస్తుంటే.. బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. అంతర్జాతీయ సదస్సుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి దిగుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ కూడా భారత్ సమ్మిట్‌ను వేదికగా మార్చుకుంది. అటు బీజేపీ జాతీయ రాజకీయ కోణంలో విమర్శలు చేస్తుంటే.. ఇటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనే ప్రధాన అస్త్రంగా చేసుకుంది. భారత్ సమ్మిట్‌కు హాజరుకావాల్సిన పలువురు విదేశీ ప్రతినిధుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని.. సదస్సుకు ఆటంకాలు కలిగిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మొత్తంగా భారత్ సమ్మిట్ ఇప్పుడు మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మక పోరుగా మారింది.