SpiceJet Passenger Protest: రహదారులపై ధర్నాలు చేయడం చూశాం.. రైల్వే పట్టాలపై కూర్చొని నిరసనలు తెలపడం చూశాం.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళనలు చేయడం కూడా చూశాం. కానీ ఏకంగా విమానాశ్రయంలో విమానం వెళ్లాల్సిన రన్‌వేపైనే ప్రయాణికులు నిరసనకు దిగితే..? అందులోనూ ఓ యువతి రన్‌వేపై పడుకొని తన నిరసనను వ్యక్తం చేస్తే..? ఇలాంటి అసాధారణ ఘటన ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. స్పైస్‌జెట్ విమానయాన సంస్థ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రయాణికులు ఆందోళనకు దిగడం విమానాశ్రయంలో కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముంబయి నుంచి గోరఖ్‌పూర్‌కు విమానం

ముంబయి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణానికి సిద్ధమై విమానం ఎక్కిన ప్రయాణికులకు చివరి నిమిషంలో ఎదురైన ఈ పరిణామం తీవ్ర నిరాశకు గురిచేసింది. అంతేకాకుండా, విమానం ఎప్పుడు బయలుదేరుతుందో, అసలు తమ ప్రయాణం కొనసాగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విమానంలోకి ఎక్కిన ప్రయాణికులను సుమారు గంటసేపు అక్కడే ఉంచడంతో వారి సహనం నశించింది. ఒకవైపు ప్రయాణం ఆలస్యం కావడం.. మరోవైపు విమానయాన సంస్థ నుంచి సరైన సమాచారం అందకపోవడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం క్రమంగా పెరిగింది. ఈ ఘటనలో ముఖ్యంగా చిన్నపిల్లలతో ప్రయాణిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలాసేపు విమానం కోసం ఎదురుచూడాల్సి రావడంతో చిన్నారులు ఆకలితో, అలసటతో ఏడుస్తూ కనిపించారు. వృద్ధులు, మహిళలు సైతం గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

రన్‌వేపైనే నిరసన.. యువతి వినూత్న ఆందోళన

విమానయాన సంస్థ నుంచి సరైన సమాచారం ఇవ్వడం లేదని, విమానం రద్దుకు గల కారణాలను స్పష్టంగా వెల్లడించడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. అంతేకాకుండా, విమానం రద్దయిన తర్వాత తమ కోసం ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొంతమంది ప్రయాణికులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ రన్‌వే ప్రాంతంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఓ యువతి ఏకంగా రన్‌వేపై పడుకొని నిరసన తెలియజేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాధారణంగా అత్యంత భద్రతతో ఉండే విమానాశ్రయ రన్‌వేపై ఇలాంటి నిరసన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికుల అసహనానికి కారణం కేవలం విమానం రద్దు కావడమే కాకుండా, తమ సమస్యలను పట్టించుకునే వారు లేకపోవడమేనని తెలుస్తోంది.

 

సోషల్ మీడియాలో వైరల్‌గా యువతి వీడియో

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఓ యువతి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కనిపించింది. తమ విమానం రద్దయిందని, కనీసం ఆ విషయాన్ని కూడా సరైన సమయంలో తమకు తెలియజేయలేదని ఆమె ఆరోపించింది. విమానంలో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీడియోలో పేర్కొంది. ప్రయాణికులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇలా ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించినట్లు వీడియోలోచెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ప్రయాణిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యువతి నిరసనను ప్రశంసిస్తూ.. అక్కా.. నువ్వు సూపర్, ఇలాంటి ఆందోళన ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి విమానం రద్దు కావడం ఒక సమస్య అయితే, ఆ సమయంలో ప్రయాణికులకు సరైన సమాచారం అందించకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. విమాన ప్రయాణం అంటేనే సమయం, సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ప్రయాణంలో చివరి నిమిషంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం కావడం సహజమే.