Abhishek Banerjee Alleges BJP: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీపావళికి ముందు రోజు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఉన్న తన నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. తన పుట్టినరోజు నాడే తనను హతమార్చేందుకు కుట్ర పన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన ఇంటి బయట కొందరు దొంగ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత మొదలైందని అభిషేక్ వెల్లడించారు. ఆ తర్వాత బీజేపీ మద్దతుదారులు ఇటుకలు, రాళ్లతో టీఎంసీ కార్యకర్తలపై దాడికి దిగారని ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిపారు. దాడికి రెండు రోజుల ముందే కొందరు బీజేపీ కార్యకర్తలు తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో తనపై ఇది ఏడో హత్యాయత్నమని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

“నన్ను చంపేందుకు ప్రయత్నించారు”

దాడికి వచ్చిన వారిలో కొందరి వద్ద రివాల్వర్లు కూడా ఉన్నాయని అభిషేక్ ఆరోపించారు. తనను హతమార్చాలనే ఉద్దేశంతోనే పక్కా ప్రణాళికతో ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనలో తన పర్సనల్ అసిస్టెంట్ వేలికి గాయమైందని.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయంటూ మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఘర్షణ జరిగినప్పటికీ వారు అడ్డుకోలేదని అభిషేక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోల్‌కతా పోలీసుల తీరుతో పాటు కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టుల వ్యవహారశైలిపైనా ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో జూన్ 19న సోనాపూర్‌లో తనపై హత్యాయత్నం జరిగిందని, ఆ ఘటనపై ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.

అభిషేక్ బెనర్జీ డ్రామాలు ఆడుతున్నారు: బీజేపీ

అభిషేక్ బెనర్జీ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. బెంగాల్ బీజేపీ నేత, బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ ఈ ఘటనను డ్రామాగా అభివర్ణించారు. ఫుట్‌పాత్‌పై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తే నిరసనలు వ్యక్తమవడం సహజమని వ్యాఖ్యానించారు. అభిషేక్‌కు హాని చేయాల్సిన అవసరం, ఉద్దేశం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. భావోద్వేగపూరిత వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు అభిషేక్ బెనర్జీ నివాసం వెలుపల తెల్లవారుజామున 2 గంటల నుంచి 3.30 గంటల మధ్య ఘర్షణలు జరిగినట్లు కోల్‌కతా పోలీసులు ధ్రువీకరించారు. ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు గాయపడినట్లు నివేదికలు అందాయని వెల్లడించారు. అయితే దాడులు రాజకీయంగా జరిగాయా..? లేకపోతే వ్యక్తిగతంగా జరిగాయా..? అన్న కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే తన కార్యాలయం, నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిఘా పెట్టారని అభిషేక్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ఘర్షణలు చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

ఎన్నికల తర్వాత వరుస వివాదాలు.. అభిషేక్‌కు కొత్త చిక్కులు

ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు అభిషేక్ బెనర్జీ చుట్టూ వివాదాలకు కారణమవుతున్నాయి. ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో గ్రామస్తులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. ఇక ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీకి సంబంధించిన కేసులోనూ అభిషేక్ బెనర్జీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆయన నివాసం వెలుపల ఘర్షణలు జరగడం బెంగాల్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది.