Demonetisation 10 Years: సరిగ్గా పదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8న అర్థరాత్రి సమయంలో ఉన్నఫళంగా పెద్ద నోట్లను రద్దు చేసింది. రూ.500, రూ.1,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది. దాంతో ఏర్పడిన కరెన్సీ కొరతను తీర్చేందుకు రూ.2,000 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నోట్ల రద్దు సమయంలో డబ్బుల కోసం ప్రజలు రాత్రింబవళ్లు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద బారులు తీరారు. గంటల తరబడి క్యూల్లో నిలబడిన వారిలో సుమారు 150 మంది మరణించినట్లు సమాచారం. అప్పట్లో చలామణిలో ఉన్న నోట్ల మొత్తం విలువలో ఏకంగా 86.9 శాతం వాటా కలిగిన రూ.500 నోటును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. డిజిటల్ చెల్లింపులు, బ్యాంకింగ్ విస్తరణ, ఆర్థిక వ్యవస్థ సంఘటితం కావడం వంటి ప్రయోజనాలు నోట్ల రద్దుతో కలుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇంత భారీ మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిపోకపోవడంతో అమలులోని లోపాలు బయటపడ్డాయి.

99.3 శాతం నోట్లు రిటర్న్

నోట్ల రద్దు తర్వాత తిరిగొచ్చిన నగదుపై రిజర్వ్ బ్యాంకు గణాంకాలు, పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. రద్దయిన నోట్ల మొత్తం విలువ సుమారు రూ.15.42 లక్షల కోట్లు కాగా, అందులో రూ.15.31 లక్షల కోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి. అంటే దాదాపు 99.3 శాతం నగదు తిరిగొచ్చింది. ఆపరేషన్ క్లీన్ మనీ కింద పన్ను వివరాలతో సరిపోలని నగదు జమ చేసిన 17.92 లక్షల మందిని గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే డీమోనిటైజేషన్ జరిగి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాలు పలు అంశాలను వెలుగులోకి తెచ్చాయి. నగదు లావాదేవీలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రూ.500 నకిలీ నోట్లు పెద్ద సంఖ్యలో పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ వేదికల ద్వారా డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి. నోట్ల రద్దు సమయంలో దేశంలో చలామణిలో ఉన్న నగదు విలువ రూ.17.76 లక్షల కోట్లు కాగా, 2026 నాటికి అది రూ.43.16 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో నగదు చెలామణిలో ఏకంగా 143 శాతం పెరుగుదల నమోదైంది.

క్యాష్‌లెస్ సమాజ లక్ష్యం ఏమైంది..?

నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పుడు దేశాన్ని నగదు రహిత సమాజంగా మార్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. యూపీఐ వినియోగాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలు అందించాలని భావించారు. భారీగా నగదు చెలామణి కావడం వల్ల అవినీతి విశృంఖలంగా వ్యాపిస్తుందని, ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని ప్రధాని మోదీ అప్పట్లో పేర్కొన్నారు. అవినీతిని అంతమొందించడమే తమ ధ్యేయమని ప్రకటించారు. అయితే, దేశాన్ని నగదు వినియోగ రహిత సమాజంగా మార్చాలన్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. నోట్ల రద్దుకు ముందు ప్రజల వద్ద ఎంత నగదు ఉందో, ఇప్పుడూ దాదాపు అదే స్థాయిలో ఉందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. నగదు వినియోగంలో పెద్దగా తేడా కనిపించడం లేదని అభిప్రాయపడుతున్నారు.

నకిలీ నోట్ల సమస్యకు పరిష్కారం దొరికిందా..?

ఉగ్రవాద కార్యకలాపాల కోసం సరిహద్దుల అవతలి నుంచి నకిలీ కరెన్సీ దేశంలోకి వస్తోందని ప్రధాని మోదీ అప్పట్లో ఆరోపించారు. రూ.500, రూ.1,000 నకిలీ నోట్ల కట్టలతో ప్రజలు పట్టుబడుతున్నారని పేర్కొన్నారు. అయితే, పదేళ్ల తర్వాత కూడా నకిలీ నోట్ల సమస్య పూర్తిగా తొలగిపోలేదు. అలాగే రూ.2,000 నోట్లను రిజర్వ్ బ్యాంకు దశలవారీగా ఉపసంహరించుకుంది. దీంతో ఆ నోట్లకు సంబంధించి ప్రస్తుతం ఎన్ని నకిలీలు గుర్తించారనే లెక్కలను కేంద్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఈ క్రమంలో నకిలీ నోట్లను గుర్తించే సాంకేతికత ఇప్పుడు మరింత అభివృద్ధి చెందింది. దీంతో నకిలీ నోట్లను గుర్తించడం సులభమైంది. నకిలీ నోట్లు ముద్రించే వారికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే నోట్ల వినియోగాన్ని తగ్గించి.. డిజిటల్ ట్రాన్సక్షన్స్‌ను పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా యూపీఐని ప్రవేశపెట్టింది. కొన్నేళ్ల పాటు యూపీఐ లావాదేవీలను ఫ్రీగా అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎండీఆర్ పేరుతో వసూళ్లు చేయడానికి సిద్ధమైంది.