Gold and Silver Prices Crash: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత కొంతకాలంగా వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయులకు చేరిన ఈ విలువైన లోహాల ధరలు ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ ధరలు క్షీణించాయి. ముఖ్యంగా వెండి ధరలో నమోదైన భారీ తగ్గుదల కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం మదుపరులు లాభాల స్వీకరణకు దిగడమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొంతకాలంగా ఈ రెండు లోహాల ధరలు గణనీయంగా పెరగడంతో పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న నిల్వలను విక్రయించి లాభాలు పొందేందుకు ప్రయత్నించారు. దీంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి.

తగ్గుదలకు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం

దీనికి తోడు అమెరికా జీడీపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా నమోదవడం కూడా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపింది. ఈ పరిణామాలతో రెండు విలువైన లోహాల ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. బంగారం ధర 2.79 శాతం తగ్గి ఔన్సుకు 3,921.32 డాలర్లకు చేరింది. ఇక వెండి ధర ఏకంగా 5.12 శాతం పడిపోయి ఔన్సుకు 49.70 డాలర్ల వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లో నమోదైన ఈ పతనం దేశీయ మార్కెట్లపైనా ప్రభావం చూపింది.

హైదరాబాద్‌లో వెండి ధర ఎంతంటే

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి ధర తగ్గుముఖం పట్టగా, హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ అదే పరిస్థితి కనిపించింది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.1,440 తగ్గి రూ.1,94,930 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు కూడా హైదరాబాద్ మార్కెట్లో క్షీణించాయి. వెండి ధరల పతనం గత కొన్ని రోజులుగా కొనసాగుతోంది. అక్టోబర్ 22వ తేదీ వరకు కిలో వెండి ధర గరిష్ఠంగా రూ.2,25,000 వద్ద ఉంది. అక్టోబర్ 23న రూ.5,000 తగ్గడంతో రూ.2,20,000కు చేరింది. అయితే అక్టోబర్ 29న మరో రూ.5,000 తగ్గగా, అక్టోబర్ 30న మరో రూ.5,000 క్షీణించింది. తాజాగా ఒక్కరోజే రూ.10,000 మేర తగ్గడంతో వెండి ధరలు మరింత దిగివచ్చాయి. ప్రస్తుతం సిల్వర్ కేజీ ధర రూ.2 లక్షలుగా ఉంది.

కొనుగోలుదారులకు భారీ ఊరట

ఒకప్పుడు కిలో వెండి ధర రూ.4 లక్షల స్థాయికి చేరుతుందన్న అంచనాల మధ్య ఇప్పుడు ధరలు గణనీయంగా తగ్గడం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. పండగ సీజన్‌లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ధరల పతనం కొంత ఉపశమనం కలిగిస్తోంది. మొత్తంగా చూస్తే.. వరుసగా పెరిగిన బంగారం, వెండి ధరలకు లాభాల స్వీకరణ రూపంలో బ్రేక్ పడింది. రికార్డు స్థాయుల నుంచి ఒక్కసారిగా దిగివచ్చిన ధరలు మార్కెట్లో కొత్త చర్చకు తెరలేపాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు.. ఆకాశాన్నంటిన వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి.