గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
Gold and Silver Prices: దీపావళి పండుగ తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక్క రోజే రెండు వేల రూపాయలకు బంగారం ధర తగ్గింది. అలాగే వెండి ధరలు సైతం తగ్గాయి.

Gold and Silver Prices: దీపావళి పండుగ తర్వాత బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం పసిడి, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.2,105 తగ్గింది. కిలో వెండి ధర కూడా రూ.2,890 మేర పడిపోయింది. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. హైదరాబాద్‌లో బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,785గా ఉండగా, గురువారం రూ.2,105 తగ్గి రూ.1,42,680కు చేరింది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు తదితర నగరాల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,150గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 3,978 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలకూ బ్రేక్
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో బుధవారం కిలో వెండి ధర రూ.1,89,700గా ఉండగా, గురువారం రూ.2,890 తగ్గి రూ.1,86,810కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ సిల్వర్ ధర 51.49 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువ, సరఫరా వ్యవస్థలో మార్పులు, కొనుగోళ్లలో హెచ్చుతగ్గులు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడిదారుల డిమాండ్ కూడా వెండి ధరల మార్పులకు కారణమవుతున్నాయి.
గరిష్ఠానికి చేరిన డాలర్ విలువ
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ 19 నెలల గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర దేశాల కరెన్సీల్లో బంగారం, వెండి కొనుగోలు చేయడం ఖరీదైనదిగా మారుతుంది. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గి, స్పాట్ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ఈ మెటల్స్ ధరలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక వచ్చే నెలలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.



