పతన బాటలో పసిడి.. ఒక్కరోజు రూ.5 వేలు తగ్గిన బంగారం
Gold Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రూ.5 వేల రూపాయలు తగ్గింది. అయితే బంగారం తగ్గడానికి గల కారణాలపై మార్కెట్ నిపుణులు విశ్లేషణలు చేస్తున్నారు.

Gold Price Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొద్ది రోజులుగా ఊరటనిచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆకాశాన్నంటిన పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు, అమెరికా డాలర్ బలోపేతం, వడ్డీ రేట్లపై అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లోనూ వరుసగా ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర మరింత దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక్కరోజే రూ.5,320 తగ్గిన పసిడి
దేశీయ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,480గా ఉండగా.. శుక్రవారం నాటికి ఏకంగా రూ.5,320 తగ్గి రూ.1,28,160కు చేరుకుంది. అంటే ఒక్కరోజులోనే పసిడి ధర గణనీయంగా దిగివచ్చింది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు వంటి నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు నమోదవుతున్నాయి. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,800కు చేరింది. ఈ ధరల తగ్గుదలతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.
త్వరలో రూ.లక్షకు 10 గ్రాముల బంగారం ధర..?
ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.28 లక్షల స్థాయిలో కొనసాగుతోంది. ఇటీవల కనిపిస్తున్న భారీ తగ్గుదల ఇదే వేగంతో కొనసాగితే 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షల దిగువకు చేరుతుందా అనే చర్చ మొదలైంది. త్వరలో పది గ్రాముల బంగారం రూ.లక్షకు వస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నిరోజులుగా బంగారం మార్కెట ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియులు లక్షకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు పసిడి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ పెంపునకు 96.7 శాతం అవకాశముందని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గే అవకాశం ఉంటుంది.
వెండి ధరల్లోనూ భారీ పతనం
బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో గురువారం కిలో వెండి ధర రూ.1,64,865గా ఉండగా.. శుక్రవారం రూ.9,965 తగ్గి రూ.1,54,900కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ స్పాట్ సిల్వర్ ధర 41.93 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడిదారుల డిమాండ్‌లో మార్పులు వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి రెండింటిలోనూ ధరల తగ్గుదల కనిపిస్తోంది. చైనా కేంద్ర బ్యాంకు వరుసగా 24వ నెల కూడా బంగారం కొనుగోళ్లు కొనసాగించడం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు 42 శాతం పెరిగి 321 టన్నులకు చేరడం వంటి పరిణామాలు మార్కెట్‌లో మరోవైపు ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ డాలర్ బలం, వడ్డీ రేట్ల అంచనాలు పసిడిపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి.


