Today Gold Rates: దీపావళి పండుగ సమీపిస్తుండటంతో బంగారం, వెండి కొనుగోళ్లకు ప్రజలు సిద్ధమవుతున్నారు. పండుగ సమయంలో బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, ఇంట్లో ఐశ్వర్యం, సంపద వృద్ధి చెందుతాయని చాలామంది విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో తాజాగా చోటుచేసుకున్న ధరల మార్పులు కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో ఒక్కరోజులోనే బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధర సైతం దిగివచ్చింది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,750గా నమోదైంది. అయితే శుక్రవారం నాటికి ధరలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఏకంగా రూ.3,208 తగ్గడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,542కు చేరింది. బంగారం ధరల్లో ఇదే తరహా మార్పులు బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు వంటి నగరాల్లోనూ కనిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు ముంబయిలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,167గా నమోదైంది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,850గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 4,040 డాలర్ల నుంచి 4,117 డాలర్ల మధ్య ఉంది.

వెండి ధరల్లోనూ తగ్గుదల

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో కిలో వెండి ధర రూ.1,94,298గా ఉండగా, గురువారం ఒక్కసారిగా రూ.5,848 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.1,88,450కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ స్పాట్ సిల్వర్ ధర 51.78 డాలర్ల నుంచి 52.49 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. దీపావళి పండుగ వేళ బంగారం, వెండి ధరల్లో కనిపిస్తున్న ఈ తగ్గుదల కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఆసక్తికరంగా మారింది.