దీపావళి రోజు నాన్‌వెజ్.. వివాదంలో ప్రియాంక చోప్రా
Priyanka Chopra nonveg controversy: దీపావళి సందర్భంగా ప్రియాంక చోప్రా ఫోటోలపై ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. దీపావళి రోజున నాన్‌వెజ్ తినడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Priyanka Chopra nonveg controversy: దీపావళి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులుకు ఎంతో ముఖ్యమైన పండుగ. అలాంటి పండుగ రోజున సంప్రదాయ బద్దంగా టపాసులు కాల్చడంతో పాటు.. పాయసం చేసుకొని కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కానీ గ్లోబల్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ దీపావళి వేడుకలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్న ఆమె.. వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే, ఈ ఫొటోల్లోని ఓ ఆహార పదార్థం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దీపావళి రోజున ప్రియాంక నాన్‌వెజ్ తింటున్నట్లు కనిపించడంతో కొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
నాన్‌వెజ్ ముక్క తింటూ ఫోటోకి ఫోజ్
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తన నివాసంలో ప్రియాంక చోప్రా దీపావళి వేడుకలను నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఇంటి అలంకరణలు, దీపావళి సంబరాలు, కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే, ఈ ఫొటోల్లో ఒకదానిలో ఆమె మాంసాహార పదార్థాన్ని తింటున్నట్లు కనిపించడంతో వివాదం మొదలైంది. హిందువులకు ఎంతో పవిత్రమైన దీపావళి పండుగ రోజున మాంసాహారం తీసుకోవడం ఏంటంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పండుగ సంప్రదాయాలను పాటించాల్సిన బాధ్యత లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో కామెంట్లు
కేవలం ఫుడ్‌పైనే కాకుండా ప్రియాంక దీపావళి వేడుకల్లో కనిపించిన ఇతర అంశాలపైనా కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపావళి రోజు నాన్‌వెజ్ తినకూడదని తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పండుగ రోజు మాంసాహారం తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. అంతేకాకుండా సంప్రదాయ దీపాలకు బదులు కొవ్వొత్తులు ఎందుకు పెట్టారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆమె దుస్తులు, హెయిర్ స్టైల్‌పై కూడా విమర్శలు చేశారు.
ప్రియాంకకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులు
మరోవైపు ప్రియాంకకు మద్దతుగా నిలుస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. దీపావళి రోజున ఏం తినాలనేది వ్యక్తిగత నిర్ణయమని, ఆహారపు అలవాట్ల ఆధారంగా ఒకరి సంప్రదాయాల పట్ల గౌరవాన్ని అంచనా వేయలేమని అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ ప్రియాంక భారతీయ పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటీవల దసరా వేడుకలను కూడా ఇంట్లో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, శివలింగ అభిషేకం, హోమం, కన్యాపూజ వంటి కార్యక్రమాలు చేపట్టారు. మొత్తానికి దీపావళి సంబరాల కంటే ఆమె ఫుడ్ మెనూనే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది



