ఖాతా దారులకు అలర్ట్.. రేపటి నుంచి బ్యాంకులు బంద్..!
Bank Holidays November 2026: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి 28 వరకు వరుస సెలవులు.. ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవంటే..?

Bank Holidays November 2026: దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన గమనిక. నవంబర్ 22 నుంచి 28 వరకు బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండుగలు, జయంతులతో పాటు నెలలోని నాలుగో శనివారం కారణంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల్లో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, ఇతర ముఖ్యమైన పనులు ఉన్నవారు ముందుగానే అప్రమత్తం కావాలి. సెలవుల వివరాలు తెలియకుండా బ్యాంకులకు వెళ్తే సమయం వృథా అయ్యే అవకాశం ఉంది.
నవంబర్ 23న షిల్లాంగ్లో బ్యాంకులకు సెలవు
నవంబర్ 23వ తేదీ సోమవారం సెంగ్ కుట్ స్నెమ్ పండుగ సందర్భంగా మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఈ ప్రాంతంలోని బ్యాంకు శాఖలు ఆరోజు పనిచేయవు. అయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతాయి.
నవంబర్ 24న గురునానక్ జయంతి.. పలు నగరాల్లో బ్యాంకులు బంద్
నవంబర్ 24వ తేదీ మంగళవారం గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, భోపాల్, చండీగఢ్, జైపూర్, కాన్పూర్, లక్నో వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఖాతాదారులు తమ బ్యాంకు పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది.
నవంబర్ 27న బెంగళూరులో హాలిడే
నవంబర్ 27వ తేదీ శుక్రవారం కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలోని బెంగళూరులో బ్యాంకులకు సెలవు ఉంటుంది. నవంబర్ 28వ తేదీ నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలకు సాధారణ సెలవు ఉంటుంది. ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించే నిబంధన ప్రకారం ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. అంతేకాకుండా నవంబర్ 29న ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణంగా సెలవు ఉంటుంది.
ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఉండదు
బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి డిజిటల్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. నగదు బదిలీలు, ఖాతా నిల్వల పరిశీలన, ఆన్లైన్ చెల్లింపులు వంటి సేవలను వినియోగించుకోవచ్చు. అయితే బ్యాంకు శాఖల్లో మాత్రమే పూర్తయ్యే కొన్ని పనులు సెలవు రోజుల్లో సాధ్యం కావు. అందువల్ల చెక్కుల జమ, నగదు లావాదేవీలు, ఇతర అత్యవసర బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించే సెలవుల క్యాలెండర్ ప్రకారం రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కాబట్టి బ్యాంకుకు వెళ్లే ముందు మీ ప్రాంతంలోని సెలవుల వివరాలను తెలుసుకొని వెళ్లడం ఉత్తమం..

