డాలర్ దెబ్బకు బంగారం, వెండి విలవిల
Gold and Silver Prices Crash: అంతర్జాతీయ అమెరికా డాలర్ విలువ తగ్గడంతో బంగారం ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రూ.2600 తగ్గింది.

Gold and Silver Prices Crash: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ మరింత బలపడటంతో పసిడి, వెండి ధరలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత దూకుడుగా పెంచవచ్చన్న సంకేతాలు ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచాయి. దీంతో లాభాల స్వీకరణకు దిగిన మదుపర్లు విలువైన లోహాల్లో అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫలితంగా బుధవారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ఫ్యూచర్స్ భారీ నష్టాలను చవిచూశాయి.
దేశీయ మార్కెట్లో పసిడి ధరకు భారీ షాక్
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,730 ఉండగా, బుధవారం నాటికి రూ. 2600 తగ్గి, రూ.1,36,130కు చేరుకుంది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు తదితర నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు ట్రేడ్ అవుతున్నాయి. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,700గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 3,793 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
లాభాల స్వీకరణతో తగ్గిన ఓపెన్ ఇంట్రెస్ట్
బంగారం ధరల పతనానికి ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కూడా ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే లాంగ్ పొజిషన్లలో ఉన్న ట్రేడర్లు వాటిని ముగించడంతో లాంగ్ అన్‌వైండింగ్ చోటుచేసుకుంది. దీంతో గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ 3.79 శాతం తగ్గి 14,845 కాంట్రాక్టులకు పరిమితమైంది. ధరలు భారీగా పడిపోయినప్పటికీ రికవరీ అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం తిరిగి పుంజుకుని రూ.1,35,220 నిరోధ స్థాయిని అధిగమిస్తే తదుపరి రూ.1,36,220 వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. డాలర్ బలపడటం, అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ పసిడి, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రానున్న ట్రేడింగ్ సెషన్లలో డాలర్ కదలికలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై మార్కెట్ దృష్టి నిలవనుంది.



