AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీలతో పాటు పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 13,167 సర్పంచ్ స్థానాలు, 1,32,514 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. తొలి విడతలో భాగంగా 3,967 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, మిగిలిన రెండు విడతలకు సంబంధించిన నోటిఫికేషన్లను ఈ నెల 16, 19 తేదీల్లో విడుదల చేయనున్నారు.

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

మొదటి విడత ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అనంతరం 18వ తేదీన ఎన్నికల అధికారులు నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. నామినేషన్ తిరస్కరణకు గురైన అభ్యర్థులకు అప్పీలు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. సంబంధిత అభ్యర్థులు 18వ తేదీనే సాయంత్రం 5 గంటలలోపు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌ను ఆశ్రయించవచ్చు. ఇక బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు.

26న తొలి విడత పోలింగ్.. అదే రోజు కౌంటింగ్

తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 26వ తేదీన ఓటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 3,967 సర్పంచ్ స్థానాలతో పాటు 40,012 వార్డు సభ్యుల స్థానాలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అవసరమైన చోట్ల 27వ తేదీన రీ-పోలింగ్ నిర్వహించడంతో పాటు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేపడతారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా గుర్తు వేయనున్నారు. ఇదే సమయంలో ఈ నెల 26న 23 పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్‌బీలు) కూడా పోలింగ్ నిర్వహించనున్నారు.

నాలుగు కార్పొరేషన్లు సహా 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. శ్రీకాకుళం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఉదయం 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంటుంది. అభ్యర్థుల సౌకర్యార్థం అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికల ప్రక్రియ ఊపందుకోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.