Dhanush Entry into Politics: తమిళ హీరో ధనుష్‌ (Dhanush) రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం మరోసారి జోరందుకుంది. ఆయన అభిమాన సంఘాన్ని సేవా సంస్థగా పునర్వ్యవస్థీకరించడంతో పాటు, తమిళనాడు వ్యాప్తంగా నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నాలు చేయడం, తాజాగా వేలాది మంది మహిళా అభిమానులతో సమావేశం కావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చాయి. దీనికితోడు, మహిళా అభిమానులకు దీపావళి కానుకగా అందించిన వెండి దీపాలపై కమలం గుర్తు కనిపించడంతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ వేదికగా పలువురు నేతలతో ధనుష్‌ (Dhanush) సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నై శివారులోని సెమ్మంచేరి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్‌ కళాశాలలో ధనుష్‌ నర్పణి ఇయక్కం మహిళా విభాగం సభ్యులు, నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 3 వేల మంది మహిళలు హాజరయ్యారు.

దీపావళి కానుకగా వెండి కామాక్షి దీపాలు

దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికీ వెండి కామాక్షి దీపాలను అందజేశారు. మహిళా అభిమానులకు పంపిణీ చేసిన వెండి దీపాలపై కమలం ఆకారపు ముద్ర కనిపించడం ఈ వ్యవహారంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కమలం భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల గుర్తు కావడంతో ధనుష్‌కు ఆ పార్టీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే, దీపాలను తయారు చేసిన కంపెనీనే ఆ ముద్రను వేసిందని, తమకు దానితో ఎలాంటి సంబంధం లేదని ధనుష్‌ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలో బీజేపీ నాయకులతో ధనుష్‌ (Dhanush) చర్చలు జరిపినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో అన్నాడీఎంకేలో (AIADMK) చేరి ఆ పార్టీని బలోపేతం చేయాలా? లేక కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లాలా? అనే అంశాలపై ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ధనుష్‌పై కాంగ్రెస్‌, టీవీకే విమర్శలు

ధనుష్‌ రాజకీయ ప్రవేశంపై కాంగ్రెస్‌తో పాటు కొన్ని పార్టీలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వారి వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని అధికార టీవీకే ఆరోపించింది. విజయ్‌కు ధనుష్‌  (Dhanush) ఎప్పటికీ నిజమైన పోటీదారు కాలేరని వ్యాఖ్యానించింది. ధనుష్‌పై కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహాత్మకంగానే తమిళనాడులో రాజకీయ కల్లోలం సృష్టించేందుకు ఓ కొత్త నటుడిని తెరపైకి తీసుకొస్తున్నాయని విమర్శించారు. ఇది ‘ఆపరేషన్‌ డీ’ లేదా ‘ప్లాన్‌ సీ’లో భాగమని ఆరోపించారు. గతంలో రజనీకాంత్‌ (Superstar Rajinikanth) ద్వారా తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయాలనే ప్రయత్నం విఫలమైందని, ఇప్పుడు మరోసారి ధనుష్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ధనుష్‌ రాజకీయ ప్రవేశంపై అధికార డీఎంకే వర్గం మరో కోణంలో స్పందించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఉందని పేర్కొంది. విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ధనుష్‌ ఎందుకు రాకూడదని ప్రశ్నించింది. ధనుష్‌ రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని అన్నాడీఎంకే నేతలు పేర్కొన్నారు.

విజయ్‌ తరహాలోనే ముందుకెళ్తున్న ధనుష్‌?

తమిళనాడులో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమైన పదవులు చేపట్టినవారు చాలామంది ఉన్నారు. వారిలో ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలిత వంటి ప్రముఖులు ఉన్నారు. ఇటీవల నటుడు విజయ్‌ (Cm Vijay) కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి టీవీకే పార్టీని స్థాపించారు. విజయ్‌ రాజకీయాల్లోకి రాకముందు తమిళనాడు వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు సాయం చేయడంతో పాటు అభిమాన సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. అనంతరం రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. ఇదే తరహాలో ధనుష్‌ (Dhanush) కూడా అభిమాన సంఘాలతో వరుసగా సమావేశమవుతున్నారు. వారితో కలిసి భోజనం చేయడం, వారి సమస్యలను తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో విజయ్‌ తరహాలోనే ధనుష్‌ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా..? అనే చర్చ మొదలైంది. Dhanush Entry into Politics