Anirudh Kavya Maran wedding: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రీస్ వేదికగా నవంబర్ 10, 11 తేదీల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది. గ్రీస్‌లో జరిగే కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలను ప్రముఖ రాజకీయ, వ్యాపారవేత్తలకు అందించారు. అయితే గ్రీస్‌లో జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు, కీలక నేతలకు ఆహ్వానాలు పంపించారు. అయితే ఆ జాబితాలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి కేవలం అల్లు అర్జున్‌కి మాత్రమే ఆహ్వానం అందింది. మిగతా సినిమా హీరోలు, పలువురు రాజకీయ నేతలకు చెన్నైలో జరిగే రిసెప్షన్ కార్యక్రమానికి ఇన్విటేషన్లు ఇచ్చారు. నవంబర్ 21న చెన్నైలో అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన వేదికను ఇప్పటికే ఖరారు చేయగా.. ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రిసెప్షన్‌కు రాజకీయ, సినీ వర్గాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.

రిసెప్షన్‌కు ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు

అయితే నవంబర్ 21న చెన్నైలో నిర్వహించనున్న అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్‌కు కేవలం సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వంటి రాజకీయ ప్రముఖులకు కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ ఆహ్వానాలు అందించారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పేర్లు కూడా అతిథుల జాబితాలో ఉన్నాయి. ఈ రిసెప్షన్‌కు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ, శివకార్తికేయన్, ఆయన భార్య ఆర్తి, రజినీకాంత్, ఏఆర్ రెహ్మాన్, హీరో అజిత్ కుమార్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, నటి ఆండ్రియా జెరెమియా, నటుడు ప్రసన్న, సూరజ్ వెంజరమూడు వంటి ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందినట్లు సమాచారం.

IPL క్రీడాకారులకు ఆహ్వానం ఇచ్చిన కావ్య మారన్

కావ్య మారన్‌కు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న అనుబంధం నేపథ్యంలో క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జంట వివాహ ఆహ్వాన పత్రిక కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు సమాచారం. పింక్ విసిల్ మ్యాన్‌కు చెందిన డిజైనర్ రంజని అయ్యంగార్ ఈ ప్రత్యేక ఆహ్వాన పెట్టెలను రూపొందించారు. ఒక్కో పెట్టె తయారీకి సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చేతితో చెక్కడం, చిత్రలేఖనం, ప్రత్యేక అలంకరణలు, అరుదైన పదార్థాల వినియోగం ఈ ధరకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ ఆహ్వాన పత్రికలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

నవంబర్ 22న ఐటీసీ చోళాలో మరో రిసెప్షన్

వివాహ వేడుకల సందర్భంగా అనిరుధ్ తన సన్నిహిత స్నేహితుల కోసం ప్రత్యేకంగా ఓ గెట్‌టుగెదర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 22న చెన్నైలోని ఐటీసీ చోళా హోటల్‌లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇది అధికారిక రిసెప్షన్ కాదని, స్నేహితులతో కలిసి సమయం గడిపేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సమావేశమని సమాచారం. ఇక సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తన సంస్థ ఉద్యోగుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేయవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే కేవలం ఆ గ్రూపుకు చెందిన ఉద్యోగులు మాత్రమే రిసెప్షన్‌కు హాజరయ్యేలా కళానిధి మారన్ ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. అనిరుధ్‌కి తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన సంగీతం అందించిన సినిమాలు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాయి. మరోవైపు కావ్య మారన్ పేరు కూడా క్రికెట్, వ్యాపార రంగాలతో ముడిపడి ఉంది. దీంతో వీరి వివాహ వేడుకలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.