హసీనాని పంపాలంటే షరతులు వర్తిస్తాయి!

బంగ్లాదేశ్ సంక్షోభంతో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ ఆశ్రయం కోరారు. రెండున్నరేళ్లుగా భారత్‌లోనే ఉంటున్న షేక్ హసీనా ఏదైతే అదవుతుందని స్వదేశానికి తిరిగెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ ప్రత్యర్థులేమో ఆమెను ఉరికంబం ఎక్కించేయాలని ఆత్రుత పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లూ హసీనాకు ఆశ్రయం కల్పించిన భారత ప్రభుత్వం ఆమెను స్వదేశానికి పంపేందుకు షరతులతో కూడిన చర్చలు జరుపుతోంది. ఆమెను బంగ్లాదేశ్‌కి తిరిగి పంపేందుకు భారత్ రెండు కీలక షరతులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
షేక్ హసీనాను స్వదేశానికి తీసుకెళ్లే బాధ్యతను బంగ్లాదేశ్ సైన్యం తీసుకోవాలనేది భారత్ పెడుతున్న కండిషన్.
బంగ్లాదేశ్ సైనిక విమానాన్ని పంపించి షేక్ హసీనాను తీసుకెళ్లాలని భారత్ షరతుపెడుతోంది. లేదంటే రెండు దేశాలకు అంగీకారయోగ్యమైన సరిహద్దులోని నిర్దిష్ట ప్రాంతంలో బంగ్లాదేశ్ సైనికాధికారులు ఆమెను స్వీకరించాలంటోంది. స్వదేశానికి తిరిగివెళ్లాక షేక్ హసీనా వ్యక్తిగత భద్రతకు బంగ్లాదేశ్ సైన్యం హామీ ఇవ్వాలనేది భారత్ పెడుతున్న మరో కండిషన్. ఆమెను అప్పగించడమే కాకుండా స్వదేశంలో హసీనా ప్రాణాలకు ముప్పు రాకూడదన్న ఆలోచనతో భారత్ ఉంది.
బంగ్లాదేశ్‌లో 2024 జూలైలో జరిగిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశం షేక్ హసీనాకు కల్పించాలని భారత్ షరతు పెడుతోంది. విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని భారత్ కోరుకుంటోంది. అంతర్జాతీయ సమాజం, వరల్డ్ మీడియా పర్యవేక్షణలో న్యాయప్రక్రియ కొనసాగాలని భారత్ భావిస్తోంది. నమ్మివచ్చిన పొరుగుదేశ నాయకురాలిని గుడ్డిగా అప్పగించి ఆమె ఉరికంబం ఎక్కే పరిస్థితి తీసుకురావద్దన్న బలమైన అభిప్రాయంతో భారత్ ఉంది.



