Hijack Digital Billboards to Show Porn: ఈజిప్ట్‌, మలేసియా, బ్రెజిల్‌ దేశాల్లోని డిజిటల్ హోర్డింగులను సైబర్ నేరగాళ్లు దాడి చేశారు. హైవేల పక్కన ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను హ్యాక్‌ చేసి, వాటిపై అశ్లీల వీడియోలను ప్రదర్శించిన ఘటనలు పలు దేశాల్లో కలకలం రేపాయి. ఈజిప్ట్‌, మలేసియా, బ్రెజిల్‌ దేశాల్లో అక్టోబర్‌ 29న ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం డిజిటల్‌ ప్రకటనల భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఈజిప్టులోని కైరో సమీప గిజా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉండే 26 జులై యాక్సిస్‌ రహదారి పక్కన ఉన్న ఓ భారీ డిజిటల్‌ బోర్డుపై సాధారణ ప్రకటనలకు బదులుగా అభ్యంతరకర వీడియోలు ప్రసారమయ్యాయి. ఈ దృశ్యాలను గమనించిన వాహనదారులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేయడంతో అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సదరు హోర్డింగ్‌ నిర్వాహక సంస్థ అల్‌ అరేబియా యునైటెడ్‌ అడ్వర్టైజింగ్‌ కంపెనీ వెంటనే ప్రసారాలను నిలిపివేసింది. అధికారుల సహకారంతో ఘటనపై విచారణ ప్రారంభించింది.

మలేసియాలో ప్లే అయిన వీడియోలు

మరోవైపు మలేసియాలోని జోహోర్‌ రాష్ట్రం క్లువాంగ్‌ పట్టణంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అక్కడి కొన్ని ఎల్‌ఈడీ ప్రకటనల తెరలపై అసభ్యకరమైన దృశ్యాలు కనిపించడంతో స్థానిక మున్సిపల్‌ అధికారులు వాటిని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బ్రెజిల్‌లోని పియావీ రాష్ట్రం కాంపో మాయోర్‌లోనూ ఓ డిజిటల్‌ ప్రకటనల ప్యానెల్‌ హ్యాకింగ్‌కు గురైనట్లు వార్తలు వచ్చాయి. సైబర్‌ దాడిని గుర్తించిన నిర్వాహకులు పరికరాన్ని ఆఫ్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడుల వెనుక లీకర్స్‌ అనే హ్యాకింగ్‌ గ్రూప్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయా డిజిటల్‌ హోర్డింగ్స్‌కు ప్రకటనలను పంపించే సాఫ్ట్‌వేర్‌లో ఉన్న భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని వ్యవస్థల్లోకి ప్రవేశించినట్లు ఆ బృందం వెల్లడించింది. ఇంటర్నెట్‌కు అనుసంధానమై ఉండి, సరైన రక్షణ లేని డిజిటల్‌ వ్యవస్థలను గుర్తించడానికి తమకు కేవలం రెండు గంటల సమయం మాత్రమే పట్టిందని పేర్కొంది.

విచారణకు ఆదేశించిన ప్రభుత్వాలు

ఈ ఘటనలపై ఈజిప్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. పలు దేశాల్లో ప్రకటనల కంటెంట్‌ను సరఫరా చేస్తున్న ఓ అంతర్జాతీయ సంస్థ వెబ్‌సైట్‌పై సైబర్‌ దాడి జరగడం వల్లే అనధికారిక వీడియోలు వివిధ ప్రాంతాల్లోని తెరలపై ప్రసారమైనట్లు తెలిపింది. అయితే దాడికి గురైన సంస్థ వివరాలను మాత్రం వెల్లడించలేదు. మొత్తంగా ఈ ఘటనలు డిజిటల్‌ ప్రకటనల వ్యవస్థల్లో ఉన్న భద్రతా లోపాలను బయటపెట్టాయి. దూరం నుంచే నియంత్రించగలిగే హోర్డింగ్స్‌కు పటిష్టమైన పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేయడం, సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం, అదనపు భద్రతా వ్యవస్థలను అమలు చేయడం ఎంత ముఖ్యమో ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.

భారత్‌లో అశ్లీల వీడియోలు ప్లే అయితే పరిస్థితి ఏంటి?

భారత్‌లో రహదారుల వెంట వేలాది డిజిటల్ హోర్డింగులు ఏర్పాటు చేశారు. వీటిపై ప్రకటనలతో పాటు వీడియోలను కూడా ప్రదర్శించే సదుపాయం ఉంది. అయితే, ఒకవేళ ఈ డిజిటల్ హోర్డింగులపై అనుకోకుండా అశ్లీల వీడియోలు ప్లే అయితే పరిస్థితి ఏంటనే ఆందోళన పలువురిలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే మూడు దేశాల్లో చోటుచేసుకున్న ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని భారత్‌లోనూ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. దేశంలోని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో రహదారుల వెంట వందల సంఖ్యలో డిజిటల్ హోర్డింగులు ఉన్నాయి. వీటిపై నిరంతరం ప్రకటనలు, వీడియోలు ప్రదర్శితమవుతుంటాయి. మరోవైపు, ప్రధాన రహదారులపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో ఒక్కసారిగా అసభ్యకరమైన లేదా అశ్లీల వీడియోలు ప్రదర్శితమైతే తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉంది.

వాహనదారుల దృష్టి మళ్లీ ప్రమాదాలు జరిగే అవకాశం

ముఖ్యంగా వాహనదారులు వీడియోల వైపు దృష్టి మళ్లిస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, చిన్నారులు ప్రయాణించే సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. పైగా ఒక్కసారిగా వాహనాలు నిలిచిపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ హోర్డింగుల నిర్వహణలో సైబర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ హోర్డింగుల వ్యవస్థలను సైబర్ దాడుల నుంచి రక్షించేందుకు పటిష్టమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, వీడియోల ప్రసారానికి ముందు అనుమతి ప్రక్రియను తప్పనిసరి చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు భారత్‌లో చోటుచేసుకోకుండా సంబంధిత అధికారులు, హోర్డింగుల నిర్వహణ సంస్థలు ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.