Bangladesh Demands Hasina Return

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత వ్యవహారం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనాపై బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి ఎండీ అసదుజ్జమాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా తమ దేశ ట్రైబ్యునల్‌లో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తి అని అన్నారు. దోషీగా తేలిన హసీనాను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చట్టపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆమెను అప్పగించాలని ఇప్పటికే భారత్‌కు పలుమార్లు విజ్ఞప్తులు చేసినట్లు తెలిపారు. అయినా ఈ వ్యవహారంపై న్యూఢిల్లీ నుంచి ఇంకా తుది నిర్ణయం వెలువడలేదన్నారు. ఈ వ్యవహారం బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉందని, భారత్‌తో కుదిరిన అప్పగింత ఒప్పందం ప్రకారం తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. భారత్‌ ఆమెను అప్పగిస్తే ఎలాంటి భావోద్వేగాలకు తావులేకుండా న్యాయ ప్రక్రియను అనుసరిస్తామన్నారు. మరోవైపు, భారత్‌ ఆమెను ఖైదీగా కాకుండా అతిథిగా పరిగణిస్తున్న అంశంపై ప్రశ్నలు ఎదురైనా.. తమ ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని ఢాకాలో నిర్వహించిన కార్యక్రమంలో ఈవ్యాఖ్యలు చేశారు.

2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో ప్రజా తిరుగుబాటు నేపథ్యంలో 15 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతూ షేక్ హసీనా దేశం విడిచి భారత్‌కు వచ్చారు. 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు సంబంధించి విచారణ జరిపి, ఆమె గైర్హాజరీలో దోషిగా నిర్ధారించింది. ఒక అభియోగంపై మరణశిక్ష, మరో అభియోగంపై జీవిత ఖైదు విధించింది. అయితే ఈ తీర్పును హసీనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ప్రకటించారు. అరెస్టు, జైలు శిక్ష, మరణశిక్ష ఎదురైనా స్వదేశానికి వెళ్తానని చెప్పారు. హసీనా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అయితే హసీనా అప్పగింత విషయంలో బంగ్లాదేశ్ అప్పగింత విజ్ఞప్తులను భారత్ పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ గతంలో స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై చట్టపరమైన, న్యాయపరమైన ప్రక్రియలను అనుసరిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. భారత్‌-బంగ్లాదేశ్ మధ్య 2013లో కుదిరిన అప్పగింత ఒప్పందం ఈ వ్యవహారంలో కీలకంగా మారింది. హసీనా అప్పగింతపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.