బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా రీ ఎంట్రీ.. తిరిగొస్తే ఉరిశిక్ష తప్పదా..?
Sheikh Hasina return to Bangladesh: బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు మాజీ ప్రధాని షేక్ హసీనా సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే కోర్టు మరణశిక్ష విధించింది. ఇప్పటికే పాస్‌పోర్టు కోసం బంగ్లాదేశ్ హైకమిషన్‌లో హసీనా దరఖాస్తు చేసుకున్నారు.

Sheikh Hasina return to Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే, ఆమె ఒకవేళ మళ్లీ దేశానికి తిరిగివస్తే కోర్టు విధించిన మరణశిక్షను అమలు చేయడం తప్ప మరో మార్గం లేదని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఎం.డి. అమీనుల్ ఇస్లాం స్పష్టం చేశారు. 2024లో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ప్రజా తిరుగుబాటును దారుణంగా అణచివేసినందుకు ఆమెపై తీవ్రస్థాయి మానవ హక్కుల ఉల్లంఘనల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అక్కడి కోర్టు విచారణ జరిపి ఆమెకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
ప్రస్తుతం ఇండియాలో ఉన్న హసీనా
ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనా ఈ డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని భావిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రాసిక్యూషన్ వర్గాలు వెంటనే స్పందించాయి. చట్టప్రకారం తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, అయితే ఆ గడువు ఇప్పటికే ముగిసిపోయిందని అమీనుల్ ఇస్లాం వివరించారు. దీంతో ఆమెకు ఎలాంటి న్యాయపరమైన రక్షణలు మిగలలేదని, న్యాయస్థానం విధించిన మరణశిక్షను ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేదని ఆయన తేల్చిచెప్పారు. 2025 నవంబర్‌లో ఢాకాలోని ప్రత్యేక ట్రిబ్యునల్ షేక్ హసీనా గైర్హాజరీలోనే సుదీర్ఘ విచారణ చేపట్టింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై హత్యలకు ఉసిగొల్పడం, ప్రత్యక్ష దాడులను అడ్డుకోకపోవడం వంటి మూడు నేరాలపై ఆమెను దోషిగా తేలుస్తూ అత్యున్నత శిక్ష అయిన మరణశిక్ష విధించింది.
పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసిన హసీనా
అయితే, ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్ని రాజకీయ నాటకంగా అభివర్ణించిన హసీనా.. ఇది కక్షసాధింపు చర్య అని కొట్టిపారేశారు. స్వదేశానికి తిరిగివస్తే ఉరిశిక్ష ఖాయమని తెలిసినప్పటికీ, డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రజల పట్ల తనకున్న బాధ్యతను, నిబద్ధతను ప్రాణభయం ఏమాత్రం మార్చలేదని వ్యాఖ్యానించారు. 2024 ఆగస్టులో వేలాది మంది ఆగ్రహించిన నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసాన్ని చుట్టుముట్టడంతో దాదాపు 15 ఏళ్లపాటు సాగిన ఆమె పాలన ముగిసింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ చివరి నిమిషంలో సైనిక హెలికాప్టర్లో భారత్‌కు చేరుకున్న ఆమె, అప్పటి నుంచి ఇక్కడే రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. ఐక్యరాజ్యసమితి అధికారిక గణాంకాల ప్రకారం, 2024లో జరిగిన నిరసనల అణచివేతలో సుమారు 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకున్నారు హసీనా.
హసీనాను భారత్ అప్పగిస్తుందా..?
మరోవైపు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని ఆ దేశ ప్రభుత్వం భారత్‌ను కోరుతోంది. అయితే, భారత్ ఆమెను వెంటనే తిరిగి పంపించే అవకాశం ఉందా.. అనే అంశం ఆసక్తికరంగా మారింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య 2013లో ప్రత్యర్పణ ఒప్పందం కుదిరింది. అయితే, అందులోని కొన్ని నిబంధనలు హసీనాకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఒప్పందం ప్రకారం, ఏవైనా ఆరోపణలు లేదా శిక్షలు రాజకీయ ప్రేరేపితమైనవని భావిస్తే, సంబంధిత వ్యక్తిని అప్పగించడాన్ని తిరస్కరించే హక్కు భారత్‌కు ఉంటుంది. హసీనా గైర్హాజరీలోనే కోర్టు విచారణ జరిపి మరణశిక్ష విధించింది. నిందితులకు తమను తాము సమర్థించుకునే తగిన అవకాశం ఇవ్వకుండా విధించిన శిక్షల ఆధారంగా వ్యక్తులను అప్పగించే విషయంలో భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే బంగ్లాదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పగింత అభ్యర్థనలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చట్టపరమైన ప్రక్రియల ద్వారా పరిశీలిస్తున్నట్లు ప్రకటిస్తోంది.



