అప్పుడూ ఇప్పుడూ ఆమెకు భారత్ భరోసా!
Bangladesh Ex-PM Sheikh Hasina: డిసెంబరులో బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు షేక్ హసీనా సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. కానీ తన నిర్ణయం మారదంటున్నారు హసీనా. అక్కడికెళ్లాక తనను అరెస్ట్ చేయొచ్చు, హింసించవచ్చు, లేదా చంపేయొచ్చని.. అయినా స్వదేశానికి వెళ్లడం తన బాధ్యతంటున్నారు

Bangladesh Ex-PM Sheikh Hasina: పొరుగుదేశంలో సంక్షోభంతో ప్రాణభయంతో వచ్చిన దేశప్రధానికి ఆశ్రయం కల్పించడం చిన్న విషయం కాదు. అది కోరి శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నట్లే. కానీ భారత్ ఆ విషయంలో ఎప్పుడూ భయపడలేదు. ఒకే నాయకురాలికి 50ఏళ్లలో రెండుసార్లు ఆశ్రయం కల్పించింది భారత్. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ చొరవచూపితే ఇప్పుడు ప్రధాని మోదీ ఆ పనిచేశారు.
1975 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు షేక్ హసీనా కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఆ కుట్రపూరిత దాడిలో బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడైన హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు భార్య, ముగ్గురు కుమారులు, బంధువులను ఊచకోత కోశారు. ఆ సమయంలో షేక్ హసీనాతో పాటు ఆమె చెల్లెలు రెహానా విదేశాల్లో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హసీనాకు ఆశ్రయం కల్పించారు. ఆరేళ్ల తర్వాత 1981లో బంగ్లాదేశ్‌కి తిరిగివెళ్లి మళ్లీ రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషించారు హసీనా.
2024లో విద్యార్థుల నిరసనలతో బంగ్లాదేశ్‌లో సంక్షోభం తలెత్తింది. నిరసనలు హింసాత్మక రూపం దాల్చటంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్‌ని వీడిన షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించింది. ఆమెను అప్పగించాలని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం కోరినా భారత్ తిరస్కరించింది, అప్పట్నించీ భారత్‌లోనే ఉంటున్న షేక్ హసీనా స్వదేశానికి స్వచ్ఛందంగా తిరిగెళ్లేందుకు సిద్ధమయ్యారు. భారత ప్రభుత్వం తనను ఎంతో ఆదరించిందని భావోద్వేగానికి గురయ్యారు.
డిసెంబరులో బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు షేక్ హసీనా సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. కానీ తన నిర్ణయం మారదంటున్నారు హసీనా. అక్కడికెళ్లాక తనను అరెస్ట్ చేయొచ్చు, హింసించవచ్చు, లేదా చంపేయొచ్చని.. అయినా స్వదేశానికి వెళ్లడం తన బాధ్యతంటున్నారు. కాకపోతే తనపై, తన మద్దతుదారులపై నమోదైన కేసుల విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని మాత్రమే ఆమె కోరుకుంటున్నారు.



