వదలని వాయుగుండాలు.. మరోసారి ఏపీకి వర్ష సూచన
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీకి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. అల్పపీడనం వాయుగుండంగా మారనుంది.

AP Rain Forecast
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస వాయుగుండాలు.. ఏపీ ప్రజల పాలిట వాయుగండాలుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ మరో కీలక సూచన చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎల్లుండి అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు(AP Rain Forecast) కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడవచ్చని, తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ వ్యవస్థ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 18 లేదా 19 నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి చేరవచ్చని అంచనా వేస్తోంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు(AP Rain Forecast) కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. అయితే ప్రజెంట్ భారీ వర్షాల సూచనలు లేవని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనం ప్రయాణించే దిశ, దాని తీవ్రత, సముద్రంలో ఏర్పడే అనుకూల వాతావరణ పరిస్థితులపై వర్షాల విస్తృతి ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతునప్పటికీ రాష్ట్రంలో వర్ష సూచనలు పెద్దగా లేవని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో పొడి వాతావరణమే కొనసాగుతుందని వెల్లడించింది. అల్పపీడనం ఉత్తర తమిళనాడు తీరంవైపు కదులుతున్న క్రమంలో దాని ప్రభావం ఏపీపై ఎంతవరకు ఉంటుందన్నది కీలకంగా మారింది. వ్యవస్థ తీవ్రత, దిశలో మార్పులు చోటుచేసుకుంటే వర్షాల తీవ్రత, విస్తృతిలోనూ మార్పులు ఉండే అవకాశం ఉంది.



