El Nino Effect: ఏపీ, తెలంగాణలో విచిత్ర వాతావరణం నెలకొంది. అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో (El Nino) ప్రభావం కొంతమేర తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీలోని రాయలసీమలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోస్తా ప్రాంతంలో అడపాదడపా తుఫాన్ల కారణంగా వర్షాలు కురుస్తుంటే.. రాయలసీమలో మాత్రం ఎల్‌నినో దెబ్బకు కరువు తాండవం చేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో రైతులు వేసిన పంటలకు నీరు లేకపోవడంతో అవి ఎండిపోతున్నాయని కొందరు అంటుంటే.. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌తో కొన్ని జిల్లాలు సుభిక్షంగా ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

ఎల్‌నినో దెబ్బకు రైతుల్లో ఆందోళన

తెలంగాణ వ్యాప్తంగా ఎల్‌నినో (El Nino) ప్రభావం భారీగా పడింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. సకాలంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతుండటంతో సాగునీటికి కటకట ఏర్పడింది. వరి పంట చేతికి వచ్చే సమయానికి నీరు లేకపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. మరోవైపు విద్యుత్ కష్టాలు వెంటాడుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రధాన డ్యామ్‌లలో నీరు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో అన్నదాతలు నీటి ట్యాంకర్ల సాయంతో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుల మోటార్లకు సకాలంలో విద్యుత్ సరఫరా కావడం లేదని.. సకాలంలో విద్యుత్ అందితే కొంతమేర పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని రైతులు చెబుతున్నారు.

తెలంగాణ రైతులకు లేని ఫసల్ బీమా యోజన

తెలంగాణ రైతులకు ఒకవైపు ఎల్‌నినో (El Nino) కష్టాలు ఉంటే.. మరోవైపు పంటలకు బీమా లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఫసల్ బీమా యోజన ద్వారా రైతులు తమ పంటలకు బీమా చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కానీ తెలంగాణ రైతులకు మాత్రం ఫసల్ బీమా యోజన అందుబాటులో లేకుండా పోయింది. రైతుల పంటలు ఎండిపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళన మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫసల్ బీమా యోజనను రద్దు చేశారు. దాని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడంతో రైతులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)ని అమలు చేసి ఉంటే రైతులకు కొంతమేర నష్టపరిహారం లభించేదని, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు ఇబ్బందుల్లోకి నెట్టబడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది.

వచ్చే ఏడాది వరకు ఎల్‌నినో ప్రభావం

వచ్చే ఏడాది జూన్ వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. వచ్చే జూన్ నాటికి ఎల్‌నినో ప్రభావంతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో భూగర్భ జలమట్టం మరింత తగ్గిపోయింది. దీంతో అనేక ప్రాంతాల్లోని ప్రజలు నీటి ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని ప్రాంతాలకు విస్తరిస్తే నీటి సరఫరాలో జాప్యం ఏర్పడుతుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. El Nino Effect