కవిత పార్టీకి ఈసీ గుర్తింపు ఎప్పుడు..?
TRS Party Registration: తెలంగాణ రక్షణ సేన పార్టీ గుర్తుపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో త్వరగా పార్టీ గుర్తును కేటాయించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

TRS Party Registration: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన (TRS)కు అధికారిక గుర్తింపు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన ఈ పార్టీకి ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు లభించలేదు. పార్టీ ఏర్పాటుతో పాటు రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేసిన కవిత.. గుర్తింపు విషయంలో మాత్రం ఎన్నికల సంఘం తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తింపు అంశంపై కవిత తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్టీ గుర్తింపు కోసం కోర్టులో పిటిషన్
తెలంగాణ రక్షణ సేనకు అధికారిక గుర్తింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కవిత తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ.. టీఆర్ఎస్ పేరుపై కొన్ని అభ్యంతరాలు రావడంతో వ్యవహారం తుది దశకు చేరలేదు. ఈ అభ్యంతరాలకు సంబంధించి తమ వివరణలను ఎన్నికల సంఘానికి అందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పేరుపై వచ్చిన ప్రతి అభ్యంతరానికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే కవిత తరఫు న్యాయవాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీకి ఎప్పుడు గుర్తింపు వస్తుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచిన కవిత
కవిత 2026 ఏప్రిల్ 25న తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ జెండా పండుగ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కమిటీల ఏర్పాటు చేపట్టారు. టీఆర్ఎస్ పేరుతో ప్రధాన కమిటీలతో పాటు అనుబంధ విభాగాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియ గడువును పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కవిత కలిశారు. ఇదే సందర్భంలో తెలంగాణ రక్షణ సేనకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు వచ్చేలా చూడాలని కోరినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల ముందే గుర్తింపు వస్తుందా…?
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రక్షణ సేనకు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కవిత తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా పార్టీకి అధికారిక గుర్తింపు లభిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. పార్టీకి గుర్తింపు లభిస్తే అభ్యర్థులకు పార్టీ తరఫున బీఫామ్‌లు అందించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటిలోగా గుర్తింపు రాకపోతే వారు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం పార్టీ నేతలు, అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
టీఆర్ఎస్ పేరుపై బీఆర్ఎస్ అభ్యంతరం..!
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత.. ఆ తర్వాత తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌కు వ్యతిరేకంగా కొత్త పార్టీని ప్రకటించారు. అంతేకాకుండా, టీఆర్ఎస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన కవిత.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పేరుపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో టీఆర్ఎస్ పేరుతోనే తమ పార్టీ కొనసాగిందని, ఆ తర్వాతే దాని పేరును బీఆర్ఎస్గా మార్చామని గులాబీ పార్టీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. టీఆర్ఎస్ పేరుతో పాటు పార్టీ గుర్తుల విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తన పార్టీకి ఎన్నికల గుర్తుతో పాటు అధికారిక గుర్తింపు త్వరగా లభించేలా కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా ఎన్నికల సంఘం అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ గుర్తు కోసం నిరీక్షిస్తున్న కవిత..!
మొత్తానికి తెలంగాణ రక్షణ సేన రాజకీయ ప్రస్థానంలో పార్టీ గుర్తింపు అంశం కీలకంగా మారింది. కోర్టులో దాఖలైన పిటిషన్, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోబోయే నిర్ణయం.. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసే విధానాన్ని ప్రభావితం చేయనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈసీ నుంచి స్పష్టత వస్తుందా..? లేక మరికొంతకాలం నిరీక్షణ తప్పదా..? అన్నది వేచి చూడాలి.



