Arunachal Pradesh ganja news: ఈశాన్య భారతంలోని ప్రకృతి అందాలకు, పచ్చని అడవులకు, కొండ ప్రాంతాలకు పెట్టింది పేరు అరుణాచల్ ప్రదేశ్‌. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రం మరో కారణంతో వార్తల్లో నిలుస్తోంది. గంజాయి అక్రమ సాగుకు క్రమంగా కేంద్రంగా మారుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల ప్రాంతాలు, కొండలు, అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇన్నాళ్లూ పెద్దగా వెలుగులోకి రాని ఈ వ్యవహారంపై అధికారులు తాజాగా ఉక్కుపాదం మోపుతున్నారు. వెస్ట్ కామెంగ్ జిల్లా కలక్తాంగ్ సబ్ డివిజన్‌లో తాజాగా నిర్వహించిన భారీ నిర్మూలన కార్యక్రమం గంజాయి అక్రమ సాగు తీవ్రతను బయటపెట్టింది. వివిధ ప్రభుత్వ విభాగాలు, భద్రతా సంస్థలకు చెందిన అధికారులతో కూడిన సంయుక్త బృందం అక్టోబర్ 26 నుంచి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ తనిఖీల్లో సుమారు 458 ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేసింది.

గంజాయి మొక్కలను తొలగించిన అధికారులు

ఈ ఆపరేషన్‌లో ఏకంగా 1.37 లక్షల కిలోలకు పైగా గంజాయి మొక్కలను తొలగించినట్లు సమాచారం. ముఖ్యంగా సామాజిక భూముల్లోనే పెద్ద ఎత్తున ఈ సాగు కొనసాగడం అధికారులను సైతం అప్రమత్తం చేసింది. ఇంత భారీ విస్తీర్ణంలో సాగు జరుగుతున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఎందుకు నియంత్రించలేకపోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొండలు, అడవులు, జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాలు అక్రమ కార్యకలాపాలకు అనుకూలంగా మారుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహస్యంగా సాగు చేపట్టి, పంట చేతికి వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ ప్రాంతాల్లో గంజాయి సాగు వెనుక ఎవరున్నారు..? దీని ద్వారా ఎంతమేర వ్యాపారం జరుగుతోంది..? సరఫరా నెట్‌వర్క్ ఎక్కడి వరకు విస్తరించింది దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మార్కెట్‌లోకి వస్తే యువతకు పెనుముప్పే..!

అరుణాచల్‌ ప్రదేశ్‌లో లక్ష కిలోల గంజాయి వ్యవహారంపై ఆందోళన మొదలైంది. పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ధ్వంసం చేసిన గంజాయి మార్కెట్‌లోకి వస్తే పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో గంజాయి నిర్మూలన కోసం ఈగల్‌ టీమ్‌ నిరంతరం శ్రమిస్తోంది. గంజాయి మూలాలు ఎక్కడ బయటపడినా వెంటనే నిందితులను కటకటాల్లోకి పంపిస్తోంది. అయితే, అరుణాచల్‌ ప్రదేశ్‌లో గంజాయి మొక్కలు భారీ వృక్షాల్లా కనిపిస్తుండటంతో.. అక్కడ ఎప్పటి నుంచి ఈ దందా సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ పండించిన గంజాయిని ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమంగా విక్రయిస్తున్నారా..?లేక ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్నారా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

ఇప్పటికైనా నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలి

ఒక్కరోజు దాడులతో గంజాయి అక్రమ సాగును పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదు. సాగు ప్రాంతాలపై నిరంతర నిఘా, అక్రమ రవాణాపై కఠిన చర్యలు, సాగు వెనుక ఉన్న వ్యక్తులు, ఆర్థిక నెట్‌వర్క్‌ల గుర్తింపు అవసరం. స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. 458 ఎకరాల్లో సాగును ధ్వంసం చేయడం అధికారులకు ఒక పెద్ద విజయమే. కానీ అసలు సవాలు మళ్లీ అదే ప్రాంతాల్లో గంజాయి సాగు జరగకుండా చూడటం. అరుణాచల్ ప్రదేశ్‌ ప్రకృతి అందాలకు చిరునామాగా ఉండాలే తప్ప, మాదకద్రవ్యాల అక్రమ సాగుకు కేరాఫ్ అడ్రస్‌గా మారకూడదు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని సమగ్ర చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో దీని ప్రభావం యువతపై తీవ్రంగా పడే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.