18 Dead in Three Accidents: దేశంలో వరుస అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం కాగా.. మధ్యప్రదేశ్‌లో రెండు వేర్వేరు అగ్నిప్రమాదాల్లో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులంతా కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

యూపీలో కారు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు విద్యుత్ స్తంభాన్ని, డివైడర్‌ను ఢీకొని బోల్తా పడటంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు సజీవదహనమయ్యారు. ముజఫర్‌నగర్ జిల్లాలోని పానిపట్‌-ఖతిమా జాతీయ రహదారిపై జగహేరి సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. హర్యానా నుంచి హరిద్వార్‌కు వెళ్తున్న కారు అతివేగంతో ప్రయాణిస్తూ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని, డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో భారీగా మంటలు చెలరేగాయి. ఒక చిన్నారి సహా ఆరుగురు కారులోనే చిక్కుకుని సజీవదహనమయ్యారు. మృతులంతా హర్యానాకు చెందిన వారుగా గుర్తించారు.

మధ్యప్రదేశ్‌లో నగల వ్యాపారి ఇంట్లో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోనూ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సివానీ జిల్లాలో నగల వ్యాపారి కుందన్‌లాల్ సోనీకి చెందిన భవనంలో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. అయితే ఆరుగురు మాత్రం మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. దీపావళి మరుసటి రోజే ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా.. వ్యాపారంలో ప్రత్యర్థులతో విభేదాలు ఉన్నాయా.. అనే కోణాల్లోనూ విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కట్నీలో మరో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలోనూ ఇదే తరహాలో మరో అగ్నిప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను సంతోషంగా జరుపుకున్న అనంతరం పూరన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు నిద్రపోయారు. ఈ సమయంలో వారి నివాసంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఒకవైపు ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం, మరోవైపు మధ్యప్రదేశ్‌లో రెండు అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇలా రెండు వేర్వేరు రాష్ట్రాల్లో 18 మంది మరణించడం సంచలనంగా మారింది.