విశాఖ డిప్యూటీ మేయర్ పదవిపై బీజేపీ గురి..?
BJP Eyes GVMC Deputy Mayor Post: మొత్తానికి విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. మేయర్ పదవి టీడీపీకి.. డిప్యూటీ మేయర్ పదవి తమకే ఇవ్వాలంటున్న బీజేపీ పట్టుబడుతోంది.

BJP Eyes GVMC Deputy Mayor Post: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయాన్ని సాధించాయి. ఈ ఎన్నికల్లో మేయర్ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి బరిలోకి దిగగా.. వైసీపీ అభ్యర్థిగా వరుదు కల్యాణి పోటీ చేశారు. ఈ పోటీలో వరుదు కల్యాణిపై 2,44,644 ఓట్ల భారీ మెజారిటీతో ముక్కా శ్రావణి విజయం సాధించారు. వార్డుల విషయంలోనూ కూటమి పార్టీలు సత్తా చాటాయి. మొత్తం 120 వార్డులకు గానూ కూటమి అభ్యర్థులు 98 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇందులో టీడీపీ 64, జనసేన 26, బీజేపీ 8 వార్డుల్లో విజయం సాధించాయి. మరో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వీరంతా కూటమికి చెందిన రెబల్ అభ్యర్థులే కావడం గమనార్హం. దీంతో కూటమి బలం 106 మంది కార్పొరేటర్లకు చేరింది. వైసీపీ 13 స్థానాల్లో గెలుపొందగా.. సీపీఎం ఒక స్థానాన్ని దక్కించుకుంది.
డిప్యూటీ మేయర్ పదవిపై బీజేపీ గురి
జీవీఎంసీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి డిప్యూటీ మేయర్ పదవిపై పడింది. ఈ పదవి ఎవరికి దక్కుతుంది? ఏ పార్టీకి అవకాశం లభిస్తుంది? అనే అంశాలపై విశాఖ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోవడానికి బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో ఈ పదవిని తమకు కేటాయించాలని విశాఖ కమలనాథులు పట్టుబడుతున్నట్లు సమాచారం. మేయర్ పదవి కూటమిలోని టీడీపీకి దక్కిన నేపథ్యంలో.. డిప్యూటీ మేయర్ పదవిని బీజేపీకి ఇవ్వాలని కోరుతున్నారు. విశాఖలో తమ పార్టీకి ఉన్న రాజకీయ ప్రాధాన్యతను గుర్తించి ఈ అవకాశం కల్పించాలని కూటమి పెద్దలను అడుగుతున్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటును తమ పార్టీకి కేటాయించలేదని.. కనీసం ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవినైనా ఇవ్వాలని బీజేపీ నేతలు కోరుతున్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విశాఖకు చెందిన వ్యక్తి కావడంతో.. ఆయన కూడా తమ పార్టీకి ఈ పదవి దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత చరిత్రను గుర్తు చేస్తున్న కమలనాథులు
డిప్యూటీ మేయర్ పదవి కోసం బీజేపీ నేతలు తమ పార్టీ గత చరిత్రను కూడా ప్రస్తావిస్తున్నారు. 1981లో విశాఖ తొలి మేయర్గా బీజేపీ తరఫున ఎన్ఎస్ఎన్ రెడ్డి ఎన్నికైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో విశాఖ ఎంపీ స్థానాన్ని కూడా తమ పార్టీ గెలుచుకుందని చెబుతున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా ఈసారి ఎంపీ సీటుతో పాటు ఇతర అవకాశాలను త్యాగం చేశామని.. అందుకే ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవిని తమకు కేటాయించాలని కూటమి పెద్దల వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో విశాఖ మేయర్ పదవిని దక్కించుకున్న తమకు.. ఇప్పుడు డిప్యూటీ మేయర్గా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
డిప్యూటీ మేయర్ రేసులో పరశురామరాజు..?
ప్రస్తుతం డిప్యూటీ మేయర్ పదవి కోసం బీజేపీ తరఫున పలువురి పేర్లు చర్చకు వస్తున్నాయి. అయితే 54వ వార్డు నుంచి విజయం సాధించిన విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే డిప్యూటీ మేయర్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు విశాఖకు వస్తున్నాయని, నగరం మరింత అభివృద్ధి చెందాలంటే డిప్యూటీ మేయర్ పదవి బీజేపీకి ఇవ్వాలని కోరుతున్నామని పరశురామరాజు పేర్కొన్నారు. విశాఖలో ఉత్తర భారతీయులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారని ఆయన గుర్తు చేస్తున్నారు.



