Kamal Sandiyar Movie Controversy

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం విడుదలకు ముందే వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. కమల్‌ హాసన్‌ పుట్టినరోజు కానుకగా చిత్రబృందం ప్రకటించిన ‘సండియార్‌’ టైటిల్‌ ఇప్పుడు తమిళనాట రచ్చరాజేసింది. సినిమా కథ కంటే ముందే టైటిల్‌ చుట్టూ వివాదం మొదలైంది. కమల్‌హాసన్‌ కొత్త చిత్రం ‘సండియార్‌’(Kamal Sandiyar Movie Controversy) ఇప్పుడు తమిళనాట రాజకీయ, సామాజిక చర్చకు తెరలేపింది. టైటిల్‌పై పుదియ తమిళగం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పేరు కుల ఆధిపత్యాన్ని ప్రోత్సహించడంతోపాటు సామాజిక వర్గాల మధ్య విభేదాలను పెంచే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివాదానికి ఆజ్యం..!
ఎస్‌.యు. అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. టైటిల్‌ పోస్టర్‌తో పాటు ప్రచారంలోకి వచ్చిన ‘ప్రతీకారం రక్తంతోనే తీరుతుంది’ అనే క్యాప్సన్‌ వివాదానికి ఆజ్యం పోసినట్లు ఉందని పుదియ తమిళగం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పదజాలం హింసాత్మక ధోరణులకు ప్రోత్సాహం కల్పించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుదియ తమిళగం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కె. కృష్ణస్వామి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. గతంలో ఇదే పేరుతో సినిమా తెరకెక్కించే ప్రయత్నం జరిగినప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయని గుర్తుచేశారు. అప్పట్లో వివాదానికి ముగింపు పలికే క్రమంలో సినిమా పేరును ‘విరుమాండి’గా(Kamal Sandiyar Movie Controversy) మార్చి 2004లో విడుదల చేశారని తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే పేరును ఎంచుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల మధ్య సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, సినిమా టైటిల్‌ విషయంలోనూ సామాజిక సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

23 ఏళ్ల తర్వాత..!
ఈ వివాదానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 2003లో కమల్‌హాసన్‌ ఇదే పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించగా, పుదియ తమిళగం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ పరిణామాల నేపథ్యంలో సినిమా పేరును ‘విరుమాండి’గా మార్చారు. ఆసినిమా 2004లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ అదే టైటిల్‌ను ప్రకటించడంతో పాత వివాదం కొత్త రూపంలో తెరపైకి వచ్చింది. ఎంపీగా ఉన్న కమల్‌హాసన్‌ సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. టైటిల్‌ మార్చడంతోపాటు సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పుదియ తమిళగం పార్టీ ఫిర్యాదుపై పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకుంది. అలాగే ఈ ఆరోపణలపై కమల్‌హాసన్‌(Kamal Sandiyar Movie Controversy) లేదా చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే అప్పుట్లో వివాదం రేగిన టైటిల్‌ను మళ్లీ కమల్‌ హాసన్‌ ఎలా ఓకే చెప్పారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గామారింది. దీంతో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఒక సినిమా టైటిల్‌ చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు తమిళనాట రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.