Tamil Nadu 17 Prisoners Escape: తమిళనాడులోని తేని జిల్లాలో సంచలనం సృష్టించిన జైలు పరారీ ఘటన పోలీసు, జైళ్ల శాఖలను ఉలిక్కిపడేలా చేసింది. తెక్కంపట్టి జిల్లా జైలు నుంచి ఒకేసారి 17 మంది విచారణ ఖైదీలు పరారయ్యారు. జైలు సిబ్బందిని మభ్యపెట్టి, వారిపై దాడి చేసిన అనంతరం ఖైదీలు తప్పించుకున్నట్లు విచారణలో గుర్తించారు.ఈ ఘటనలో నలుగురు ఖైదీలను పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకోగా, మిగిలిన 13 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టడంతో పాటు తమిళనాడు వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడమే కాకుండా.. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఫిట్స్‌ వచ్చినట్లు నటించిన 17 మంది ఖైదీలు

సోమవారం రాత్రి తెక్కంపట్టి జైలులో ఒకే గదిలో ఉన్న 17 మంది ఖైదీల్లో ఓ వ్యక్తికి అకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేదని, ఫిట్స్ వచ్చినట్లుగా వ్యవహరించారు. సినిమాలో మాదిరిగా సాయం చేసేందుకు వచ్చిన జైలు సిబ్బందిపై ఖైదీలు దాడికి పాల్పడ్డారు. ఒకేసారి 17 మంది సిబ్బంది అక్కడి నుంచి తప్పించుకు పారిపోయారు. ఈ ఘటనలో తంగపాండి అనే జైలు సిబ్బందికి తలపై తీవ్ర గాయమైంది. మరో ఇద్దరు సిబ్బందికి కూడా గాయాలైనట్లు సమాచారం. 17 మంది ఖైదీలు పరారైనట్లు తెలియడంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జైలు పరిసర ప్రాంతాలు, అడవులు, రహదారులు, ఇతర అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ప్ర‌వీణ్, శిలంబరసన్, రాజ్‌కుమార్, రాజా సికందర్ అనే నలుగురిని తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. మిగిలిన 13 మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

రంగంలోకి 17 ప్రత్యేక బృందాలు

ఒకేసారి ఇంతమంది ఖైదీలు తప్పించుకోవడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తేని జిల్లా ఎస్పీ ప్రవీణ్ గౌతమ్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తమిళనాడు సౌత్ రీజియన్ ఐజీ విజయేంద్ర బిదరి కూడా జైలును సందర్శించి సిబ్బందిని విచారించారు. పరారైన వారిని పట్టుకునేందుకు 17 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తేని జిల్లాతో పాటు మదురై, దిండిగల్ తదితర పొరుగు జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు అనుమానితుల ఫొటోలను పోలీసు విభాగాలకు పంపించినట్లు సమాచారం. దిండిగల్ జిల్లాలో 16 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరారైన వారిలో ఎక్కువమంది మదురై జిల్లాకు చెందిన విచారణ ఖైదీలుగా గుర్తించారు. తేని, మదురై, దిండిగల్ తదితర ప్రాంతాలకు చెందిన విచారణ ఖైదీలను ఈ జైలులో ఉంచుతుంటారు. పరారైన 17 మంది ఖైదీలకు తీవ్ర నేరస్వభావం ఉన్నట్లు పోలీసుల విచారణ గుర్తించారు. ఒక్కోక్కరిపై పదుల సంఖ్యలో ఉన్నట్లు రికార్డుల్లో తేలింని పోలీసులు చెబుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమా..?

ఒకే గదిలో ఉన్న 17 మంది ఖైదీలు ఒకేసారి ఎలా తప్పించుకోగలిగారనే దానిపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీకి ఆరోగ్యం బాగోలేదనే సమాచారంతో సిబ్బంది గది వద్దకు వెళ్లినప్పుడు అవసరమైన భద్రతా జాగ్రత్తలు తీసుకున్నారా..? సిబ్బంది సంఖ్య సరిపడా ఉందా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, అందరూ ముందుగానే కలిసి ప్రణాళిక వేసుకున్నారా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ఖైదీలు ఇతర జిల్లాలకు లేదా తమిళనాడు సరిహద్దుల వైపు వెళ్లే అవకాశం ఉండటంతో పోలీసులు తనిఖీలను విస్తరించారు. ముఖ్యమైన రహదారులు, వాహన రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి చోట్ల నిఘా పెంచారు. ఈ ఘటన తమిళనాడు జైళ్లలో భద్రతా ప్రమాణాలు, ఖైదీల పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది స్పందన వంటి అంశాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.