Tamil Nadu CM Vijay Meets Chandrababu Naidu: ఏపీలో త‌మిళ‌నాడు సీఎం ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. ఉండ‌వ‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ భేటీ అయ్యారు. తమ నివాసానికి వచ్చిన సీఎం విజయ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో స‌త్క‌రించారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలను సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిచయం చేశారు.

ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో కీల‌క అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ముఖ్యంగా తెలుగు గంగ నీటి విడుదల, గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో పాటు ప‌లు అంశంపై సుదీర్ఘంగా చర్చలు జ‌రిపారు. ఈ ఏడాది చెన్నైకి 4.08 టీఎంసీల నీరు ఏపీ అందిస్తుంది. ఎల్‌నినో ప్ర‌భావంతో నీటి ఎద్ద‌డి ఏర్ప‌డిన‌ క్ర‌మంలో నీటి విడుదలను మ‌రింత పెంచాలని తమిళనాడు సీఎం.. చంద్ర‌బాబును విజ్ఞప్తి చేశారు. నీటి లభ్యత ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా మ‌రింత నీటిని వినియోగించుకోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీని ద్వారా ద‌క్షిణాది రాష్ట్రాల్లో రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని విజ‌య్‌కి చంద్రబాబు తెలిపారు. ఈరెండు న‌దుల అనుసంధానంతో దక్షిణాది రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల సమన్వయంతో, కేంద్ర సహకారంతో ఈ భారీ ప్రాజెక్టును సాకారం చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసేందుకు క‌స‌ర‌త్తు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించ‌నున్నారు. సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించి న‌దులు అనుసంధాన ప్ర‌క్రియ‌ను ప‌ట్టాలు ఎక్కించ‌నున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనలను వినేందుకు తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం విజయవాడ వ‌చ్చారు. వీరిద్ద‌రి ముందు చూపుతో గోదావరి – కావేరి అనుసంధానంతో వృధాగా పోతున్న వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే ఆలోచనలకు ముందడుగు పడనుంది. ఇదే క్ర‌మంలో గోదావరి – కావేరి అనుసంధానంలో భాగంగా గోదావరి – బనకచర్లను ఏపీ ప్రభుత్వం.. త‌మిళ‌నాడు సీఎం ముందు ప్రతిపాదిస్తుంది. గోదావరి నుంచి కృష్ణకు.. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు గోదావరి నీటిని తరలించేలా ప్రతిపాదన చేస్తోంది. బొల్లాపల్లి నుంచి బనకచర్లకు, అక్కడి నుంచి పెన్నాకు నీటిని తీసుకెళ్లేలా ఏపీ ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. కండలేరు ద్వారా కావేరి నదికి నీటిని తీసుకెళ్లేలా గోదావరి – కావేరి అనుసంధాన ప్రతిపాదన చేస్తోంది. పొరుగు రాష్ట్రాల భాగస్వామ్యం, కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టు సాకారం చేయాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇదేగాని జ‌రిగితే ఏపీ, త‌మిళ‌నాడుకు మంచి రోజులు రానున్నాయ‌ని రైతులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.