Pune Mystery Death: విదేశాల్లో చదువుకుంటున్న తమ కుమార్తె త్వరలో మంచి భవిష్యత్తును నిర్మించుకుంటుందని ఆశించిన ఆ తల్లిదండ్రులకు ఊహించని విషాదం ఎదురైంది. లండన్‌లో ఉంటోందని భావించిన కుమార్తె.. ఎవరికీ తెలియకుండా భారత్‌కు తిరిగివచ్చి, మహారాష్ట్రలోని పూణెలో ఓ అద్దె ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించింది. ఆమె రహస్యంగా స్వదేశానికి ఎందుకు వచ్చింది? ఒంటరిగా ఉంటున్న ఫ్లాట్‌లో ఏం జరిగింది? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పోలీసులు ఉన్నారు.

లండన్‌కు వెళ్లిన యువతి.. ఆగస్టులోనే స్వదేశానికి!

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన 34 ఏళ్ల యువతి ముగ్ధ అవినాష్ దేశ్‌ముఖ్ ఎంబీఏ చదివేందుకు 2025 జూలైలో యూకేలోని లండన్‌కు వెళ్లారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమార్తెతో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతుండేవారు. ఆమె లండన్‌లోనే ఉంటోందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, వారికి తెలియని విషయం మరొకటి ఉంది. ముగ్ధ లండన్‌కు వెళ్లిన కొద్ది రోజులకే, అంటే ఆగస్టులోనే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా భారత్‌కు తిరిగివచ్చారు. అనంతరం పూణెలోని గహుంజే ప్రాంతంలో ఉన్న లోధా బెల్మోండో అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని నివసించడం ప్రారంభించారు. తల్లిదండ్రులకు మాత్రం తాను లండన్‌లో ఉన్నట్లు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అక్టోబర్ 24 నుంచి ముగ్ధ ఫోన్‌కు కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందన రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. దీంతో లండన్‌లో ఉన్న ఆమె స్నేహితురాలిని సంప్రదించి కుమార్తె గురించి ఆరా తీశారు.

బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో గుర్తించిన తల్లిదండ్రులు

ఈ క్రమంలో స్నేహితురాలు వెల్లడించిన సమాచారం కుటుంబ సభ్యులను మరింత కలవరపరిచింది. ముగ్ధ లండన్‌లో లేదని తెలియడంతో అక్కడి పోలీసులను సంప్రదించారు. వారి విచారణలో ఆమె ఆగస్టులోనే యూకే విడిచి వెళ్లినట్లు వెల్లడైంది. కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు భారతీయ హైకమిషన్‌ను ఆశ్రయించారు. మరోవైపు ఆమె బ్యాంకు ఖాతా లావాదేవీలను పరిశీలించడం ప్రారంభించారు. అక్టోబర్ 8 నుంచి 25 మధ్య జరిగిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, ఇతర సేవల కోసం చేసిన చెల్లింపులను పరిశీలించగా.. ఆమె పూణెలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు కొన్ని కీలక ఆధారాలు లభించాయి. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో ముగ్ధ నివసిస్తున్న ఫ్లాట్‌ను గుర్తించారు. అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. పోలీసుల ప్రాథమిక పరిశీలనలో మృతదేహంపై ఎలాంటి బాహ్య గాయాల గుర్తులు కనిపించలేదని సమాచారం. అయితే, ఆమె మరణానికి అసలు కారణం ఏమిటనేది ఇప్పుడే నిర్ధారించలేమని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.

మిస్టరీగా మారిన ముగ్ధ మరణం

ముగ్ధ లండన్ నుంచి తిరిగి రావడానికి కారణమేంటి.. తల్లిదండ్రులకు తన రాక గురించి ఎందుకు చెప్పలేదు.. పూణెలో ఒంటరిగా ఎందుకు నివసిస్తున్నారు.. ఆమె మరణం సహజంగానే జరిగిందా.. లేక మరేదైనా కారణం ఉందా.. అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎన్నో ఆశలతో కుమార్తె ముగ్దను తల్లిదండ్రులు యూకేకి పంపించారు. త్వరలో భారత్‌కు వచ్చి తమను సంతోషంగా చూస్తుందని సంబరపడ్డారు. కానీ ఇంతరలో పూణెలో శవంగా కనిపిచండంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమార్తె మరణానికి గల కారణాలపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.